Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆకతాయిలకు షీ టీమ్స్ సింహస్వప్నం : సీపీ సజ్జనార్
posted on: Jan 25, 2026 4:35PM

మహిళల భద్రతకు హైదరాబాద్ నగరం మరోసారి అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆకతాయిలు, పోకిరీలు, బ్లాక్‌మెయిలర్లు, ప్రేమ పేరుతో మోసం చేసే మోసగాళ్లకు హైదరాబాద్ షీ టీమ్స్ నిజంగానే ‘సింహస్వప్నం’గా మారాయి. మహిళలపై జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేయడంలో, బాధితులకు అండగా నిలవడంలో షీ టీమ్స్ మరోసారి తమ సమర్థతను చాటుకున్నాయి. గత ఏడాది కాలంలో నగరవ్యాప్తంగా షీ టీమ్స్‌కు మొత్తం 1,149 ఫిర్యాదులు అందగా, వాటన్నింటినీ అత్యంత బాధ్యతాయుతంగా, గోప్యంగా పరిష్కరించడం విశేషం. కేవలం ఫిర్యాదుల పరిష్కారమే కాకుండా, క్షేత్రస్థాయిలో మఫ్టీలో నిఘా, రెడ్ హ్యాండెడ్ అరెస్టులు, కౌన్సెలింగ్ కార్యక్రమాలతో
మహిళలకు భద్రతా భావాన్ని మరింత బలపరిచాయి. నమ్మకం ద్రోహంగా మారిన వేళ… షీ టీమ్స్ రక్షణస్నేహం పేరుతో పరిచయం… ప్రేమ పేరుతో చనువు… అదే ఇప్పుడు ఆమె మెడకు ఉచ్చుగా మారింది. నమ్మి కొన్ని వ్యక్తిగత ఫొటోలు పంచుకున్న యువతిని, అవే ఫొటోలను అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం బెదిరింపులు.“డబ్బులిస్తావా… లేకపోతే ఫొటోలను సోషల్ మీడియా లో పెట్టాలా” అంటూ నిత్యం వేధింపులు. చావలేక, బతకలేక నరకయాతన అనుభవించిన ఆ యువతి చివరకు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో, నిందితుడిని పట్టుకుని బాధితురాలికి విముక్తి కల్పించారు.ఇలాంటి ఘటనలు ఒక్కటే కాదు. రోజూ ఆఫీస్‌కు వెళ్లే మహిళ ను నీడలా వెంటపడటం, ప్రేమించకపోతే చంపేస్తా నంటూ బెదిరింపులు, ఫోన్ బ్లాక్ చేసినా కొత్త నంబర్లతో అసభ్య సందేశాలు, కాల్స్… దిక్కుతోచని స్థితిలో ఉన్న మరో మహిళకు కూడా షీ టీమ్స్ అండగా నిలిచాయి.
బ్లాక్‌మెయిలింగ్ భూతం… 366 మందికి విముక్తి
ఈ ఏడాది షీ టీమ్స్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా 366 కేసులు బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించినవే. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమై, తీయని మాటలతో నమ్మించి చనువు పెంచుకుని, ఆపై వీడియో కాల్స్, వ్యక్తిగత ఫొటోలతో ఉచ్చు బిగించడం పరిపాటిగా మారింది. వీడియో కాల్ సమయంలో స్క్రీన్ రికార్డింగ్ చేయడం, పంపిన ఫొటోలను సేవ్ చేసుకుని డబ్బుల కోసం వేధించడం, లేదా ప్రేమ విఫలమైన తర్వాత పాత ఫొటోలను అడ్డం పెట్టుకుని మాజీ ప్రేమికులు బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి. “నాతో మాట్లాడకపోతే… వేరే పెళ్లి చేసుకుంటే… నీ ఫొటోలు నీ కాబోయే భర్తకు పంపిస్తా” అంటూ వేధించిన కేసుల్లో షీ టీమ్స్ జోక్యంతో బాధితులకు న్యాయం జరిగింది.
సాంకేతికత మాటున వేధింపులు
స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా యాప్స్ చాటున దాక్కుని మహిళలను వేధిస్తున్న ఘటనలూ పెరుగుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో నిద్రపోనివ్వకుండా అసభ్య కాల్స్, కొత్త నంబర్లు, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా వేధింపులు వంటి 121 కేసులు నమోదయ్యాయి. వీటిలో 50 మంది మహిళలు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామని ఫిర్యాదు చేయగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అలాగే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నకిలీ ఐడీలు సృష్టించి వేధించడం, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన కంటెంట్ పంపడం వంటి 82 కేసులను షీ టీమ్స్ సమర్థంగా పరిష్కరించాయి.
ప్రేమ పేరుతో మోసం… పెళ్లి అనగానే జలక్
ఈ ఏడాది అత్యంత ఆందోళన కలిగించిన అంశం ప్రేమ, పెళ్లి పేరుతో జరిగిన మోసాలు. “నిన్ను పెళ్లి చేసుకుంటా” అని నమ్మించి శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని, తీరా పెళ్లి ప్రస్తావన రాగానే ముఖం చాటేయడం వంటి 98 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇలాంటి కేసుల్లో బాధితులు తీవ్ర డిప్రెషన్‌కు లోనవుతుండగా, షీ టీమ్స్ కౌన్సెలింగ్‌తో పాటు నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించింది.
మఫ్టీలో నిఘా… 3,826 మందికి కౌన్సెలింగ్
ఫిర్యాదుల పరిష్కారంతో పాటు, నగరవ్యాప్తంగా 15 షీ టీమ్స్ బృందాలు బస్టాండ్లు, కాలేజీలు, మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో నిఘా కొనసాగించాయి. ఈ క్రమంలో 2025లో ఏకంగా 3,826 మంది ఆకతాయిలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వారిలో మెజారిటీకి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వగా, తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి జైలుకు పంపారు.
మహిళల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవు
ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కఠిన హెచ్చరిక జారీ చేశారు.“మహిళల జోలికొస్తే మీ ఆటలు సాగవు. ముఖ్యంగా బ్లాక్‌మెయిలింగ్ పేరుతో ఆడబిడ్డలను భయపెట్టాలని చూస్తే, మీ భవిష్యత్తు జైలు గోడల మధ్యే అంతమవు తుంది” అని స్పష్టం చేశారు. అలాగే మహిళలకు భరోసా ఇస్తూ, “వేధింపులను మౌనంగా భరించవద్దు. మీ వివరాలు బయటపడతాయన్న భయం అవసరం లేదు. మీ ఫిర్యాదులు అత్యంత గోప్యంగా ఉంచుతాం. మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు… షీ టీమ్స్ మీ రక్షణ కవచంలా నిలబడతాయి” అని తెలిపారు.ఆపదలో ఉంటే… వెంటనే సంప్రదించండివేధింపులకు గురవుతున్న మహిళలు వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555 ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.


.webp)



