ఎఫ్బీ సీఈవో జూకర్ బెర్గ్ పదవి... ఊడిపోనుందా?
posted on Feb 8, 2017 3:22PM

జనాలు చేతిలో బుక్ పట్టుకోవటం మానేశారు! కనీసం ఫేస్ అద్దంలో చూసుకుందాం అన్నా టైం వుండటం లేదు! అంత బిజీ అయిపోయారు అందరూ! అయినా కూడా కోట్లాది మంది ఫేస్బుక్ లో కాలక్షేపం చేస్తున్నారు! అంతలా వ్యసనంగా మారిపోయింది ఎఫ్బీ! ఆ ఎఫ్బీ సృష్టి కర్తే మార్క్ జూకర్ బెర్గ్! ఆయన తన సోషల్ మీడియా వెబ్ సైట్ కంపెనీకి కేవలం ఓనర్ మాత్రమే కాదు సీఈవో కూడా. కాని, ఇప్పుడు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికే ఎసరు వచ్చినట్టు కనిపిస్తోంది!
సమ్ ఆఫ్ అస్ అనే ఒక వినియోగదారుల హక్కుల కోసం పోరాడే సంస్థ వుంది. దాని వెబ్ సైట్లో కొందరు ఒక అన్ లైన్ ఉద్యమం మొదలుపెట్టారు. వాళ్ల డిమాండ్ ఏంటంటే, ఎఫ్బీ కి వన్నాఫ్ ది డైరెక్టర్స్ గా, సీఈవోగా జూకర్ బెర్గ్ వుండకూడదని! అందుక్కారణం లేకపోలేదు. జూకర్ బెర్గ్ అటు యజమానిగా, ఇటు సీఈవోగా రెండు పదవుల్లో వుండటం వల్ల ఆయనకు తిరుగులేకుండా పోతోంది. ఆయన నిర్ణయాలు ఎదిరించే అవకాశమే లేదిప్పుడు. షేర్ హోల్డర్స్ కి నచ్చినా, నచ్చకపోయినా అన్నీ భరించాల్సిందే. అందుకే, జూకర్ బెర్గ్ గుత్తాధిపత్యం నచ్చని కొందరు షేర్ హోల్డర్స్ ఆన్ లైన్ ఉద్యమం చేపట్టారు.
జూకర్ బెర్గ్ సీఈవోగా తప్పుకోవాలని జరిగిన ప్రచారానికి మద్దతుగా మొత్తం 3లక్షల మందికి పైగా సంతకాలు చేయగా... అందులో లక్షా 5వేల మంది ఎఫ్బీ షేర్ హోల్డర్స్ వున్నారట! ఇంత మంది మార్క్ జూకర్ బెర్గ్ ను సీఈవోగా వద్దని చెబుతున్నా ఇప్పటికిప్పుడు ఆయన పదవికి పెద్దగా గండమేం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇప్పటికీ అత్యధిక శాతం వాటా జూకర్ బెర్గ్ దే. ఆయన చేతిలో మెజార్టీ షేర్స్ వున్నంత కాలం ఎవ్వరూ ఏం చేయలేరంటున్నారు. అందుకే, జూకర్ కూడా దీన్ని లైట్ తీసుకుంటున్నాడట!