శ్రమ జీవుల సమక్షంలో కూలీ దంపతుల షష్టిపూర్తి

posted on: May 26, 2026 11:16AM

ఉపాధి హామీ పని ప్రదేశంలో వినూత్న వేడుక 

సాధారణంగా షష్టిపూర్తి వేడుకలంటే కల్యాణ మండపాల్లోనో, బంధుమిత్రుల కోలాహలం మధ్యో జరుపుకోవడం చూస్తుంటాం. కానీ, అందుకు భిన్నంగా నిరుపేద శ్రమజీవుల మధ్య..  తాము నిత్యం పని చేసే ఉపాధి హామీ క్షేత్రంలోనే షష్టిపూర్తి వేడుకలు జరుపుకుని ఆదర్శంగా నిలిచారు ఆ దంపతులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని స్థలంలో ఆకుతోట జయమ్మ, సోమయ్య దంపతుల షష్టిపూర్తి వేడుక  ఘనంగా జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  జయమ్మ, సోమయ్య దంపతులు ప్రతిరోజూ ఇతర కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సోమయ్యకు 60 ఏళ్లు నిండడంతో, తమతో పాటు ప్రతిరోజూ చెమటోడ్చి పని చేసే  తోటి కూలీల సమక్షంలోనే ఈ వేడుకను జరుపుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

 సోమవారం (మే 25) ఉదయం పని స్థలానికి చేరుకున్న జయమ్మ, సోమయ్య దంపతులు నూతన వస్త్రాలు ధరించారు.  తోటి ఉపాధి హామీ కూలీలందరూ కలిసి ఈ దంపతులను ఒకచోట కూర్చోబెట్టి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.  షష్టిపూర్తి సందర్భంగా దంపతులు తోటి కూలీలకు మిఠాయిలు తినిపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. కూలీలందరూ ఆ దంపతులకు నూరేళ్ల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దీవెనలు అందించారు. హంగులు, ఆర్భాటాలకు పోకుండా, నిత్యం మాతో కలిసి కష్టపడే తోటి కూలీల మధ్య ఈ వేడుకను జరుపుకోవడం మాకు ఎంతో తృప్తినిచ్చింది అని ఆకుతోట సోమయ్య, జయమ్మ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్భాటంగా చేసుకునే వేడుకల కంటే, శ్రమను నమ్ముకున్న తోటి కూలీల మధ్య ఎంతో ఆత్మీయంగా, సాదాసీదాగా  షష్టిపూర్తి జరుపుకోవడం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ వినూత్న వేడుకకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...