పాకిస్తాన్‌ క్రికెటర్ల స్వరం మారుతోందా!

posted on: Mar 14, 2016 3:56PM

అదివరకు 'నువ్వెంతంటే నువ్వెంత' అనుకునే పాకిస్తాన్‌, భారత్‌ క్రికెటర్ల మధ్య ఉన్న సంబంధాలు ఇప్పుడు మెరుగుపడుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. భారత్‌లో జరగనున్న టి-20 ప్రపంచ కప్‌ను ఆడేందుకు వచ్చిన పాకిస్తాన్‌ సీనియర్ల మాటలే దీనికి నిదర్శనం. ‘క్రికెట్‌ ఇరు దేశాలను దగ్గరకు తీసుకువస్తుందని, తమ దేశంలో కంటే ఇక్కడే ఎక్కువగా అభిమానాన్ని సంపాదిస్తున్నామని’ పాకిస్తాన్‌ కేప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు. పైగా ‘రక్షణ ఏర్పాట్ల గురించి వ్యాఖ్యానించడానికి తాము రాజకీయ నాయకులం కాదనీ, క్రికెటర్లుగా ఇక్కడ పొందే అపారమైన అభిమానమే తమను ఇక్కడ ఆడేందుకు ప్రేరేపిస్తోందని’ చెప్పుకొచ్చాడు. ఇదివరకు దూకుడుగా మాట్లాడే షాహిద్‌ ఆఫ్రిది నోటి వెంట ఇలాంటి మాటలు ఆశ్చర్యాన్నే కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఆఫ్రిది, భారతీయులకు అంత ఔదార్యం లేదని నోరుజారి విమర్శలపాలయ్యాడు.

మరో క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ కూడా షాహిద్‌ను అనుసరిస్తూ భారతీయులను వెనకేసుకొచ్చాడు. టెన్నిస్‌ తార సానియా మీర్జాను పెళ్లి చేసుకుని లక్షలాది యువకుల అసూయకు కారణమైన షోయబ్‌కి కూడా భారత్‌- పాకిస్తాన్ సంస్కృతిలో పెద్ద తేడా కనిపించదట. ‘తను తరచూ భారతదేశానికి వస్తూనే ఉంటాననీ, తనకి ఎప్పుడూ ఇక్కడ రక్షణపరమైన సమస్యలు తలెత్తలేదని’ అన్నాడు. అంతేకాదు! ‘తనకి భారతదేశమంటే చాలా ప్రేమ అనీ, ఇక్కడ ఉండటం ఓ గౌరవమనీ’ పేర్కొన్నాడు. భారతదేశంలో ఉండటం ఓ గౌరవం అన్న విషయం, ఇక్కడి పౌరులు కూడా గుర్తిస్తే బాగుండు!

google-ad-img
    Related Sigment News
    • Loading...