ఏపీ మంత్రి పిఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు... సమగ్రదర్యాప్తునకు సీఎంవో ఆదేశం
posted on Nov 29, 2025 12:01PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న సతీష్ అనే వ్యక్తిపై లెంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో పాటు వెంటనే అతడిపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది. సతీష్ పై ఒక మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు వాస్తవమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో పేర్కొంది. దీంతో సతీష్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఓ మహిళ, మంత్రి పీఏ సతీష్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం సీఎంవో దృష్టికి వెళ్లింది.
ఈ వ్యవహారంలో రెండు వైపులా విచారణ జరపాలని సీఎంవో సూచించింది. మహిళ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని పేర్కొంది. ఒకవేళ ఆమె ఆరోపణలు అవాస్తవమని విచారణలో తేలితే, ఆమెపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇలా ఉండగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంత్రి వద్ద పీఏగా పని చేస్తున్న సతీష్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. కుట్రపూరితంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏనాడూ మంత్రి పేరు చెప్పుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నించలేదన్నారు. విచారణలో నిజానిజాలు నిగ్గుతేలుతాయని సతీష్ పేర్కొన్నారు.