ఇక అవి కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగమే
posted on: Dec 8, 2014 11:29AM
.jpg)
ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ఏడు మండలాలను, ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఏడు మండలాల బదిలీ ప్రక్రియ ఈ మధ్యనే పూర్తయిందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణరావు తెలిపారు. ఆ మండలాలతో బాటు అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేయబడ్డారు. కనుక వారికి ఈ నెల నుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే జీతాలు చెల్లించబోతున్నట్లు ఆయన తెలిపారు. పరిపాలనా సౌలభ్యం మరియు భౌగోళిక స్థితిని బట్టి ఆ ఏడు మండలాలో కొన్నిటిని తూర్పు గోదావరి మరి కొన్నిటిని పశ్చిమ గోదావరి జిల్లాలలో విలీనం చేసారు. కనుక రాష్ట్ర పోలీస్ పరిధి కూడా ఆ మేరకు పెంచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
అదేవిధంగా భద్రాచలం సమీపంలో ఆంద్ర సరిహద్దులో గల ఏటిపాక కేంద్రంగా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రెండు జిల్లాలలో విస్తరించిన ఆ ఏడు మండలాలు దాని క్రిందకు వస్తాయి. ఈ పని పూర్తయిన తరువాత నుండి ఆ ఏడు మండలాలలో నివసిస్తున్న ఆదివాసీల పునరావాసానికి అవసరమయిన చర్యలు చెప్పట్టడం మొదలయ్యే అవకాశం ఉంది. కొత్తగా రాష్ట్రంలో విలీనమయిన ఈ మండలాలకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిని విస్తరించేందుకు అవసరమయిన మార్గదర్శకాలు, ఏర్పాటు మరొక వారం రోజుల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు.




.jpg)

.webp)



