సుప్రీంలో లాలూకు చుక్కెదురు.. లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ రద్దుకు నో

posted on: Apr 13, 2026 3:33PM

బీహార్ లో అప్పట్లో సంచలనం సృష్టించిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో  ఆర్జేడీ  అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనతో పాటు తన కుటుంబ సభ్యులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం (ఏప్రిల్ 13) డిస్మిస్ చేసింది.  

ఈ కేసులో విచారణను నిలిపివేయడానికి, ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.  సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరిస్తూనే.. లాలూ ప్రసాద్ యాదవ్ వయస్సును, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోనికి తీసుకున్న సుప్రీం కోర్టు ఆయనకు  ట్రయల్ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.  

లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన  సమయంలో అంటే 2004, 2009 మధ్య కాలంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించి, దానికి ప్రతిఫలంగా లాలూ కుటుంబ సభ్యుల పేరిట లేదా వారి బినామీల పేరిట భూములను నామమాత్రపు ధరలకే రాయించుకున్నారన్నది అభియోగం.

ఈ కేసులో తనపై, తన కుటుంబ సభ్యులపై సీబీఐ చార్జిషీట్ ను రద్దుచేయాలని కోరుతూ.. లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ను ఇంతకు ముందు ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ లాలూప్రసాద్ యాదవ్ సుప్రీంను ఆశ్రయించగా అక్కడా ఆయనకు చుక్కెదురైంది.  ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు తేజస్వియావ్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. తాజాగా సుప్రీం కోర్టు కూడా వారిపై ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరించడంతో సీబీఐ కోర్టులో విచారణ ప్రక్రియ యథావిధిగా సాగుతుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...