Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సుప్రీంకోర్టులో డీఎంకేకు చుక్కెదురు.. సీఎం విజయ్ కరూర్ పర్యటనకు తొలగిన అడ్డంకులు.!
posted on: Jul 7, 2026 3:55PM

తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం ప్రశ్నించింది.
గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 10న కరూర్ సందర్శనకు సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో.. డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో ఈ నెల 10న సీఎం విజయ్ కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne





