సుప్రీంలో వాన్ పిక్ కు చుక్కెదురు
posted on: Feb 11, 2026 8:02AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వాన్ పిక్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. వాన్ పిక్ ప్రాజెక్టుపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆ సంస్థ దాఖలు చేసుకున్న పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం (ఫిబ్రవరి 10) కొట్టివేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సమర్ధిస్తూ తామ జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. వాన్‌పిక్‌పై సీబీఐ మోపిన అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, కింది కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ వాన్‌పిక్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొంటూ, ప్రస్తుత దశలో ఈ కేసులో కలుగజేసుకోలేమని పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్‌పిక్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులు, రాయితీల రూపంలో లబ్ధి చేకూర్చారని, అందుకు ప్రతిగా వాన్‌పిక్ ప్రమోటర్లు జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వాన్‌పిక్‌పై హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగనుంది.






