మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురు.!

posted on: Jul 29, 2026 1:55PM

 ఏపీ మద్యం కుంభకోణం కేసులో  వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు  సుప్రీంకోర్టులో  చుక్కెదురైంది. మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు,   ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన    సీజేఐ  నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఈ కుంభకోణంలో 350 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందనడానికి   ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.   ప్రజల సొమ్ము దుర్వినియోగం కావడంపై సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం   ఉందన్న సుప్రీం కోర్టు . అక్రమంగా చేతులు మారిన వేల కోట్ల రూపాయల వెనుక  అసలు సూత్రధారులు ఎవరు, ఆ డబ్బు ఎక్కడికి తరలించారనే నిజానిజాలు బయటకు రావాలంటే నిందితులను నేరుగా ప్రశ్నించడమే సరైన మార్గమని అభిప్రాయపడింది.

ఇందు కోసం కస్టోడియల్ విచారణ అవసరమనీ, ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక నేరాలలో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించకుండా పూర్తి నిజాలు రాబట్టడం సాధ్యం కాదని  సుప్రీం ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. విచారణాధికారులకు సహకరించాల్సిన బాధ్యత నిందితులపై ఉందే తప్ప, విచారణ నుంచి తప్పించుకోవడానికి యాంటిసిపేటరీ బెయిలు  రక్షణ కవచంలా ఉపయోగపడకూడదని  స్పష్టం చేసింది. 350 కోట్ల రూపాయల మేర ప్రజాధనానికి గండి పడిందన్న ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో, నిందితుడికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు   దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటూ కారుమూరి నాగేశ్వరరావు యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఏపీ మద్యం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు మార్గం సుగమమైనట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

AP liquor scam, Karumuri Nageswara Rao, Supreme Court verdict, anticipatory bail rejected

google-ad-img
    Related Sigment News
    • Loading...