ప్రజా సేవ కోసమే ఎన్టీఆర్ ట్రస్ట్.. భువనేశ్వరి
posted on Jan 18, 2025 3:07PM
.webp)
ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని నారా భువనేశ్వరి చెప్పారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహా నటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్ అని నారా భువనేశ్వరి అన్నారు. రాజకీయ రంగంలో ఆయన ముద్ర చెరగనిదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఘన నివాళులర్పించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ సేవలను ముందుకు తీసుకెళ్లేందుకే ఎన్టీఆర్ ట్రస్టును ఏర్పాటు చేశామన్న భువనేశ్వరి ఈ ట్రస్టు ద్వారా నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామన్నారు. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు, మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రస్టుకు 8.70 లక్షల మంది రక్తదానం చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించామని చెప్పారు. హైదరాబాద్ చర్లపల్లిలోని ఎన్టీఆర్ ట్రస్టు స్కూల్లో ఉచిత విద్య, వసతి, భోజనం కల్పిస్తున్నామని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నామని చెప్పారు. కరోనా, తుపాన్ల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందించామని వెల్లడించారు.