వరుస ప్రమాదాలు.. బస్సెక్కాలంటేనే భయపడుతున్న జనాలు
posted on Nov 4, 2025 9:15AM
.webp)
తెలుగు రాష్ట్రాలను వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. బస్సు ఎక్కలాంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా తెలుగు రాష్ట్రాలలో మంగళవారం (నవంబర్ 4) ఉదయం మూడు బస్సు ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఒకరు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మొన్నటి మొన్న కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై... 27 మంది సజీవదహనం అయ్యారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 20మంది మృతి చెందగా...మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. అవి ఇంకా జనం మనస్సులలో మాయని గాయంగా సలుపుతుంగడానే.. .నిన్నటి ఘటన నుండి తేరుకొక ముందే ఈరోజు తాజాగా మరో రెండు ప్రమాదాలు జరగడంతో బస్సు ప్రయాణమంటేనే జనం వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గుబావిగూడెం వద్ద కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న చెర్రీ ట్రావెల్స్ బస్సు నార్కెట్ పల్లి -అద్దంకి హైవే పై ట్రాక్టర్ ను డికొట్టింది. బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో రోడ్డుపై ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి గాయాలయ్యాయి.ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రేణిగుంట బ్రిడ్జ్ వద్ద మరో రోడ్డుప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెడుతున్న ఆర్టీసీ బస్సు వడ్ల లోడ్ ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. వారందరిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఆంధ్రలో నిన్న అర్థరాత్రి దాటిన తరువాత మరో రోడ్డు ప్రమాదం జరిగింది. జబ్బార్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో ఐచర్ ను ఢీ కొందిజ ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.