షాకింగ్ అంచనా: ఏడాదిలో లక్ష మార్కుకు సెన్సెక్స్? నిపుణులు ఏమంటున్నారంటే!

posted on: Jul 7, 2026 11:54AM

భారతీయ స్టాక్ మార్కెట్ గత రెండేళ్లుగా మదుపరులకు పెద్దగా లాభాలను అందించలేదు. ఎటు చూసినా ఒకే పరిధిలో కదలాడుతూ ఇన్వెస్టర్లను కాస్త నిరాశకు గురిచేసింది. అయితే, త్వరలోనే దేశీయ మార్కెట్లలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోందా అంటే అవుననే అంటోంది ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ. రాబోయే 12 నెలల్లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా లక్ష మార్కును తాకే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఒక నివేదికలో వెల్లడించింది. అయితే ఈ లక్ష మార్కును అందుకోవడానికి మార్కెట్లో ఎలాంటి పరిస్థితులు ఉండాలో కూడా వారు స్పష్టంగా వివరించారు. ఈ ప్రయాణంలో మార్కెట్ గమనాన్ని అంచనా వేసేందుకు వారు మూడు రకాల అవకాశాలను (సినారియోలను) తెరపైకి తెచ్చారు.

మొదటిది 'బుల్ కేస్' (అత్యంత సానుకూల పరిస్థితి). రాబోయే ఏడాది కాలంలో సెన్సెక్స్ లక్ష పాయింట్లకు చేరుకోవడానికి 25 శాతం అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈ మైలురాయిని అందుకోవాలంటే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ (కనిజ చమురు) ధరలు ప్రతి బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువగా ఉండాలి. చమురు ధరలు తగ్గితే భారతదేశానికి వాణిజ్యపరంగా భారీ ప్రయోజనం చేకూరుతుంది. దీనికి తోడు దేశీయంగా ఆర్థిక వృద్ధిని పెంచే ప్రభుత్వ విధానాలు తోడైతే, అది మార్కెట్లకు భారీ బూస్ట్ ఇస్తుంది. ఈ బుల్ కేస్ సినారియోలో, 2026 ఆర్థిక సంవత్సరం నుండి 2029 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో సెన్సెక్స్ కంపెనీల ఆదాయాలు ఏటా 19 శాతం చొప్పున చక్రవడ్డీ రూపంలో (CAGR) వృద్ధి చెందుతాయని బ్రోకరేజ్ సంస్థ లెక్కగట్టింది.

రెండవది 'బేస్ కేస్' (సాధారణ ఆర్థిక పరిస్థితులు). రాబోయే 12 నెలల్లో సెన్సెక్స్ 89,000 పాయింట్ల స్థాయికి చేరుకోవడానికి అత్యధికంగా 50 శాతం అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. దేశంలో స్థిరమైన స్థూల ఆర్థిక పరిస్థితులు కొనసాగడం, ప్రైవేట్ రంగ పెట్టుబడులు పుంజుకోవడం, అలాగే నిజమైన ఆర్థిక వృద్ధి రేటుకు, వడ్డీ రేట్లకు మధ్య అనుకూలమైన వ్యత్యాసం ఉండటంపై ఈ అంచనా ఆధారపడి ఉంది. ఈ సాధారణ పరిస్థితిలో సెన్సెక్స్ కంపెనీల ఆర్నింగ్స్ 2029 ఆర్థిక సంవత్సరం వరకు 16 శాతం మేర చక్రవడ్డీ రేటుతో వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. సెన్సెక్స్ 89,000 మార్కును చేరితే, అది 23.5 రెట్ల ట్రైలింగ్ పి/ఇ (P/E) మల్టిపుల్‌ను కలిగి ఉంటుంది. ఇది గత 25 ఏళ్ల సగటు పి/ఇ అయిన 22 రెట్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం. భారతదేశ మధ్యకాలిక వృద్ధిపై ఉన్న నమ్మకం, స్పష్టమైన ప్రభుత్వ విధానాల వల్లే మార్కెట్‌కు ఈ స్థాయి ప్రీమియం వాల్యుయేషన్ లభిస్తుందని రిధమ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.

మూడవది 'బేర్ కేస్' (ప్రతికూల పరిస్థితులు). ఒకవేళ అంతర్జాతీయంగా పరిస్థితులు క్షీణిస్తే, సెన్సెక్స్ 66,000 పాయింట్ల స్థాయికి పడిపోయే ప్రమాదం కూడా ఉందని, దీనికి 25 శాతం అవకాశం ఉందని బ్రోకరేజ్ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో మార్కెట్ భారీ ర్యాలీ సాధించాలంటే గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే భారత్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుందనేది కీలకం కానుంది. రాబోయే త్రైమాసిక ఫలితాలు మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్లలో భారతదేశ పెట్టుబడుల-జీడీపీ నిష్పత్తి (Investment-to-GDP ratio) 37.5 శాతానికి పెరుగుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (FPI) నిబంధనల సరళీకరణ, ఐపీఓ (IPO) పైప్‌లైన్ బలంగా ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చే అంశాలు. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఫైనాన్షియల్స్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ, ఇండస్ట్రియల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగాలు లాభదాయకంగా ఉండవచ్చని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్లికేషన్ల తయారీలో ఐటీ సర్వీసెస్ కంపెనీలు 'డార్క్ హార్స్' లాగా దూసుకుపోయే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ ఈ నివేదికలో సూచించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...