హైకోర్టు న్యాయవాది హత్య కేసులో సంచలన విషయాలు

posted on: May 26, 2026 1:13PM

హైదరాబాద్‌ లో తీవ్ర సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది మొహిజుద్దీన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే సంచలన విషయాలు బయటపడుతున్నాయి. న్యాయవాదిని  పక్కా ప్లాన్‌తో అమలు చేసిన  సుపారీ ఆపరేషన్ ద్వారా హత్య చేసినట్లు అని పోలీసులు అనుమానిస్తున్నారు. రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో జరిగిన ఈ ఘటన వెనుక భూ వివాదాలే ప్రధాన కారణమని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. న్యాయవాది మొహిజుద్దీన్ తమకు అడ్డుగా మారారని భావించిన కొందరు.. ఏడాది క్రితమే హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

డిసెంబర్‌లోనే కిషన్‌సింగ్ అలియాస్ పప్పుకు సుపారీ అప్పగించినట్లు అనుమానిస్తున్న పోలీసులు… ఈ హత్యను ప్రమాదంలా చూపించేందుకు ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఈ ముఠా కారు స్టంట్స్‌లో దీటైన అభిజిత్‌ను రంగంలోకి దింపారు. అంతేకాదు… ఎవరికీ అనుమానం రాకుండా సెకండ్‌హ్యాండ్ కారు కొనుగోలు చేసి, పలుమార్లు  రిహార్సల్స్  కూడా చేసినట్లు విచారణలో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

హత్యకు మూడు రోజుల ముందే మొహినుద్దీన్ కదలికలపై నిఘా పెట్టిన సుపారీ ముఠా… ఈ నెల 22న నారాయణగూడలోని ఓ హోటల్‌లో చివరి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తెల్లవారుజామున ఇంటి వద్ద కారుతో ఢీకొట్టి హత్య చేసి నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఘటనలో పాల్గొన్న రెండు కార్లకూ పెద్దగా డ్యామేజ్ లేకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.

సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు… ఇది సాధారణ హిట్ అండ్ రన్ కాదని నిర్ధారించారు. నెంబర్ ప్లేట్ లేని కారుతో దాడి చేసినట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే కిషన్‌సింగ్, వినయ్, నాని, అభిజిత్‌లను గుర్తించిన పోలీసులు… వినయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉండగా, వారు చిక్కితే ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అన్నది బయటపడే అవకాశ ముందని పోలీసులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...