Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...M Arjuna Raju: టాలీవుడ్ లో విషాదం.. ఎన్టీఆర్ నిర్మాత కన్నుమూత!
posted on: Mar 14, 2026 11:17AM

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు (80) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. (M Arjuna Raju)
అర్జునరాజు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ సినిమాలు నిర్మించి, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'రోజా ఆర్ట్స్' బ్యానర్‌పై తన మిత్రుడు శివరామరాజుతో కలిసి నందమూరి తారకరామారావు (NTR) హీరోగా 'వేటగాడు', 'కొండవీటి సింహం' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను నిర్మించారు.
సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజులతో 'అడవి సింహాలు', శోభన్ బాబుతో 'కోడెత్రాచు' వంటి చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవితో 'జేబుదొంగ', అక్కినేని నాగార్జునతో 'బావ నచ్చాడు', శ్రీకాంత్ హీరోగా 'మా నాన్నకు పెళ్లి', ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 'జాబిలి' వంటి విజయవంతమైన సినిమాలను అందించారు. ఆయన చివరగా జగపతిబాబు హీరోగా 'జగపతి' చిత్రాన్ని నిర్మించారు.
కేవలం తెలుగులోనే కాకుండా, హిందీలో 'నిషానా', 'జానీ దోస్త్', 'ఫర్జ్ ఔర్ కానూన్' వంటి చిత్రాలను నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

అర్జునరాజుమృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి , పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. "మన ప్రముఖ సినీ నిర్మాత, ఆప్తులు, మిత్రులు, పెద్దలు గౌరవనీయులైన ఎం. అర్జునరాజు గారి అకాల మరణం మమ్మల్ని అందరినీ దుఃఖ భ్రాంతంలో ముంచేసింది. వారితో పంచుకున్న ప్రేమ, అనురాగాలు మరువలేనివి. మా కుటుంబం తరఫున వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాము." అని తెలిపారు.
అర్జునరాజు అంత్యక్రియలు శనివారం (మార్చి 14) మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Also Read: విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్ రియాక్షన్






