మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటు
posted on Oct 28, 2025 1:22PM

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మావోయిస్టులు వరుసగా లొంగుబాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మరో కీలక మావోయిస్టు నేత మంగళవారం (అక్టోబర్ 28) పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు. బండి ప్రకష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి.
-1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎస్‌యూ తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాష్. దాదాపు 45 సంవత్సరాలుగా సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలలోనూ, రాష్ట్ర కమిటీ సభ్యుడుగానూ పనిచేసిన బండి ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అనడంలో సందేహం లేదు.