నా గురించి వర్రీ కాకండి: ఏ.బి. వెంకటేశ్వర రావు

కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఏ.పీ. సర్కార్

ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దూకుడు గా వ్యవహరిస్తోంది.

జగన్ సర్కార్.... ఏమిటీ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలు... నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ అదనపు డి.జి. గా ఒక వెలుగు వెలిగిన ఏ.బి. వెంకటేశ్వర రావుతో  ఇప్పటి ప్రభుత్వం వ్యవహరించిన విధానం అసలేమాత్రం బాలేదనేది నిపుణుల అభిప్రాయం. అవును, ఏ.బి. రక్షణ పరికరాలు కొనడం మాత్రమే కాదు... 23 మంది ఎం.ఎల్.ఏ.  లను కొనడంలో కూడా కీలక పాత్ర పోషించారు... కాదనలేము.... ప్యానెల్ లో నిపుణుడు అయిన అధికారిని మార్చి తన పేరు మాత్రమే ఉండాలి అని చూసుకున్న సర్క్యులర్ ఉంది. ఇదీ కాదనలేం. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కనుగోలు చేసి, నాయుడు పట్ల తన ప్రభు భక్తిని చాటుకున్నారు ...ఇది జగమెరిగిన సత్యం..ఇందులోనూ ఎలాంటి వివాదం లేదు..కానీ, ఇవన్నీ చేసింది ఆయన తన ప్రభుత్వానికి మీ నుంచి..అంటే వై.ఎస్.ఆర్.సి.పి . నుంచి ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్త లో భాగంగానే అనే విషయం మీరు గుర్తించాలి. అసలు లోగడ , ఏ ప్రభుత్వమైనా ఇలా కక్ష గట్టి అధికారులను టార్గెట్ చేసిన సందర్భాలున్నాయా.... మీ తండ్రి హయాంలో ..చంద్రబాబు నాయుడు భక్తులైన అధికారులకు కూడా సముచిత ప్రాధాన్యం లభించిన సంగతి మీకు తెలియదా.... చంద్రబాబు నాయుడి కి అత్యంత నమ్మకస్తుడైన సతీష్ చంద్ర చేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగాఉన్న సమయం లో జలయజ్ఞం బాధ్యతలు అప్పగించలేదా... జగన్ మోహన్ రెడ్డి గారూ... ముఖ్యమంత్రిగా మీరు అందరినీ కలుపుకుని పోవలసిన సందర్భం ఇది... ఇంటా , బయటా శత్రువులను తయారు చేసుకుంటే, రాబోయే ఆపదల నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.

ఇది ప్రతిపక్ష నేత నాయుడిని అభినందించాల్సిన సందర్భం ..ఎందుకంటే, ఎలాంటి అధికారి చేతనైన ఆయన పని చేయించుకునే  తీరు నుంచి మీరు నేర్చుకోవలసిన అవసరం ఏంటో ఉంది. జాస్తి కృష్ణ కిషోర్ లాంటి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆఫీసర్ మీద కేసులు బనాయించిన మీ తీరు చూస్తే, పిడుక్కీ, బియ్యానికి ఒకటే మంత్రమేసే మీ అమాయకత్వమే కనిపిస్తోంది. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్ట్రర్స్ దాటి వెళ్ళొవద్దనేంత ఆదేశాలు ఇచ్చేముందు అసలు ఏ.బి. ర్యాంక్ ఏమిటి చూశారా..అన్నీ బావుంది, నాయుడు అధికారం లోకి వచ్చి ఉంటె, ఆయన డి.జి.పి . ఆయ్యేవారు... 40 ఏళ్ళ  సర్వీసు ఉన్న ఆ ఆఫీసర్ ఉన్న పళంగా ఏ విదేశాలకూ పారిపోరు...సెలవు పెట్టి తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని వ్యాపకం గా చేసుకున్న ఏ.బి. ఎక్కడికి పారిపోతారు?

ఐదు కారణాలను చూపుతూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలకు  విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు, ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు , ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ, విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని కూడా పేర్కొన్నారు. విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ చేశారు. నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణతో పాటు, కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని, విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని, ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని, నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని, కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారని ఆరోపణలు చేశారు.

వాస్తవానికి ఇవన్నీ భారీ స్థాయి అభియోగాలు. అఖిల భారత సర్వీసు నిబంధలు ఉల్లంఘిస్తే, ఏ.బి. రాజద్రోహానికి పాల్పడినట్టు మీరు భావిస్తే, మన రక్షణ వ్యవహారాలకు భంగం కలిగించేలా ప్రోటోకాల్ నిబంధల కు నీళ్లు వదిలితే ...రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు....సొంతంగా దర్యాప్తు చేయటానికి మీకున్న విశేషాధికారాలు ఏమిటి..లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని మీకు తెలియదా? నిజానికి సస్పెండ్ చేయటమ వరకూ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది.... దీనిని ర్యాటిఫై చేయాల్సింది కేంద్రమే.నెలరోజుల లోపు ఈ వ్యవహారాన్ని కేంద్రానికి చేరవేయాలి.

ఈ మొత్తం ఎపిసోడ్ పై ఏ.బి. వెంకటేశ్వర రావు 'తెలుగు వన్' తో మాట్లాడుతూ... మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల మానసికంగా తనకు వచ్చిన నష్టమేమీ లేదని, కాబట్టి మరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని కూడా ఏ.బి. చెప్పారు.