కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ కన్నుమూత

posted on: Apr 8, 2026 2:58PM

 కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ  మంత్రి మోహ్సినా కిద్వాయ్ ఇకలేరు. గత కొంతకాలంగా వయస్సు సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న ఆమె బుధవారం ( ఏప్రిల్ 8) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 94 ఏళ్లు.  మోహ్సినా కిద్వాయ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో   బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు  తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిద్వాయ్, ఆరు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలు అందించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా రవాణా, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి వంటి  కీలక శాఖలను నిర్వహించారు.  

 ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా  పనిచేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కూడా ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  సభ్యురాలిగా ఆమె సేవలందించారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆమె కాంగ్రెస్ వెంటే నిలిచారు. ముఖ్యంగా 1978లో జరిగిన అజంగఢ్ ఉప ఎన్నికలో ఆమె సాధించిన విజయం, కాంగ్రెస్ పునరుజ్జీవనానికి నాంది పలికిందని చెప్పాల్సి ఉంటుంది. ఆమె మృతి పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.కిద్వాయ్ మృతి పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...