సెక్షన్ 8 అమల్లోనే వుందట

 

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వున్న ‘సెక్షన్ -8’ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమలు చేయడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం పట్టుదల మీద వున్న విషయం తెలిసిందే. పాపం రెండు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్ గారికి కూడా హైదరాబాద్‌లో సెక్షన్ 8ని అమలు చేయాలా వద్దా, అధికారాలు తన చేతిలోకి తీసుకోవాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్లో వున్నారు. ఈ విషయంలో ఏం చేయమంటారు అని కేంద్రాన్ని అడిగినా అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. ఈ గందరగోళం ఇలా వుంటే, ఈ విషయంలో సోమవారం నాడు ఒక క్లారిటీ వచ్చింది. ఒక్కోసారి రాజకీయ నాయకులకు, రాజ్యాంగబద్ధమైన హోదాల్లో వున్నవారికి రాని క్లారిటీ న్యాయస్థానాలకు వస్తూ వుంటుంది. అందుకే న్యాయవ్యవస్థ మీద అప్పుడప్పుడూ గౌరవం పెరుగుతూ వుంటుంది. సోమవారం నాడు సెక్షన్ 8 విషయంలో హైకోర్టు ఇచ్చిన క్లారిటీ కూడా న్యాయ వ్యవస్థ మీద గౌరవాన్ని పెంచేలాగానే వుంది.

సెక్షన్ 8 అమలు చేయాలా వద్దా అని జుట్టు పీక్కుంటున్న వాళ్ళకి హైకోర్టు ఇచ్చిన క్లారిటీ కళ్ళు తెరిపించే అవకాశం వుంది. సెక్షన్ 8 అమలు చేయాలా వద్దా అనే సందేహాలే వద్దు.. హైదరాబాద్‌లో ఆల్రెడీ సెక్షన్ 8 అమల్లోనే వుంది. దీన్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దే అని హైకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 8 అమలు విషయంలో దాఖలైన ఒక పిటిషన్ మీద హైకోర్టు స్పందిస్తూ ఇలా కామెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 6లో వున్న విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయం అమల్లో వున్నప్పుడు, సెక్షన్ 8లోని గవర్నర్‌ చేతికి శాంతిభద్రతలు అనే అంశం కూడా అమల్లో వున్నట్టేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్నిబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింద ఏమిటంటే, సెక్షన్ 8 అమల్లోనే వుంది. అయితే గవర్నర్ గారు దానిని సమర్థంగా అమలు చేయడం లేదు. హనుమంతుడికి తన శక్తి ఏమిటో ఎవరో ఒకరు చెబితేగానీ తెలిసినట్టు, గవర్నర్ గారికి కూడా తన శక్తి ఏమిటో హైకోర్టు చెబితేగానీ తెలియదో ఏమిటో. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమల్లో వుందని హైకోర్టు చెప్పింది కాబట్టి ఇక గవర్నర్ గారు తన అధికారాల మేరకు పరిపాలనను ముందుకు నడిపితే బాగుంటుంది.