ఇజ్రాయెల్–యుఏఈ రహస్య భేటీ.. కొత్త భద్రతా సమీకరణమా?

posted on: May 15, 2026 3:04PM

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య చోటుచేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌తో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న తరుణంలో..  ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 2026 మార్చి 26న రహస్యంగా యూఏఈలోని అల్ ఐన్ నగరానికి చేరుకుని, ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌తో కీలక చర్చలు జరిపినట్లు ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ప్రకటనను యూఏఈ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించిందనుకోండి అది వేరే విషయం. 

అబ్రహాం ఒప్పందాల తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడినప్పటికీ, ప్రస్తుత ఈ నారేటివ్ ల యుద్ధం ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో సరికొత్త మలుపుగా కనిపిస్తోంది.   ఇజ్రాయెల్ వర్గాల సమాచారం ప్రకారం, నెతన్యాహు అల్ ఐన్ నగరంలో పలు గంటల పాటు యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ భేటీ ప్రధానంగా ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పులు, గల్ఫ్ ప్రాంతంలో రక్షణ వలయాన్ని బలోపేతం చేయడం,  ఇజ్రాయెల్ సైనిక సహాయంపై కేంద్రీకృతమైందని వారు చెబుతున్నారు. కేవలం ప్రధాని మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ అధిపతి డేవిడ్ బర్నియా, షిన్ బెట్ చీఫ్ కూడా గతంలో రహస్యంగా యూఏఈని సందర్శించి సైనిక సమన్వయంపై చర్చలు జరిపినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ భేటీని ఇజ్రాయెల్ ఒక  చారిత్రాత్మక బ్రేక్‌త్రూ గా అభివర్ణిస్తూ.. తాము అరబ్ ప్రపంచంలో ఒంటరి వాళ్ళం కాదనే సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది.   దీనికి భిన్నంగా అబుదాబి స్పందన ఉంది. నెతన్యాహు పర్యటన వార్తలను యూఏఈ పూర్తిగా తోసిపుచ్చింది. తమ మధ్య ఎటువంటి రహస్య ఒప్పందాలు లేవనీ..  ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధాలన్నీ అబ్రహాం ఒప్పందాల పరిధిలో పారదర్శకగానే సాగుతున్నాయని స్పష్టం చేసింది. 

అయితే..  విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యూఏఈ ఉపయోగిస్తున్న భాషలో  డిప్లొమాటిక్ డినైబిలిటీ కనిపిస్తోంది. అంటే, ఆ రోజు నెతన్యాహు తమ దేశంలో ఉన్నారా లేదా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా.. కేవలం ఆ వార్తలను అసత్యాలుగా కొట్టిపారేయడం ద్వారా ఇరాన్,  అరబ్ ప్రజల నుంచి వచ్చే ఆగ్రహాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.   ఈ దౌత్యపరమైన గందరగోళం మధ్య ఒక కీలకమైన రక్షణ పరిణామం వెలుగులోకి వచ్చింది. అమెరికా రాయబారి మైక్ హకబీ అందించిన సమాచారం మేరకు, యూఏఈ విజ్ఞప్తి మేరకు ఇజ్రాయెల్ తన శక్తిమంతమైన  ఐరన్ డోమ్  క్షిపణి రక్షణ వ్యవస్థను మొదటిసారిగా విదేశీ నేలపై మోహరించింది. ఇరాన్ ప్రయోగించిన సుమారు 550 బాలిస్టిక్ మిసైళ్లు, 2,200కు పైగా డ్రోన్ల నుంచి తమ నగరాలను, మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ తన పట్టు పెంచుకుంటున్న క్రమంలో, యూఏఈ ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షణ కవచం కిందకు చేరడం పశ్చిమాసియా రక్షణ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తోంది.   

యూఏఈ ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ లతో ఆర్థిక మరియు భద్రతాపరమైన భాగస్వామ్యం అవసరమైతే, మరోవైపు పాలస్తీనా అంశంపై అరబ్ దేశాల్లో ఉండే భావోద్వేగాలను, అంతర్గత ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సి ఉంది. 2020లో అబ్రహాం ఒప్పందాల సమయంలో వెస్ట్ బ్యాంక్ ఆక్రమణను నిలిపివేస్తామన్న షరతుపై సంబంధాలు కుదిరినప్పటికీ.. ఇజ్రాయెల్ చర్యలు ఆ ఒప్పందానికి సవాలుగా మారుతున్నాయి. అందుకే ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న సైనిక బంధాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా, తన ప్రాంతీయ లెజిటిమసీని,  మోడరేట్  దేశమనే గ్లోబల్ ఇమేజ్‌ను కాపాడుకోవాలని అబుదాబి భావిస్తోంది.   ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు భారతదేశానికి కూడా అత్యంత కీలకం. భారత్ తన చమురు,  సహజ వాయువు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే అధికంగా ఆధారపడి ఉంది. హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న సైనిక మోహరింపులు ఇంధన ధరలపై,  సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతే కాకుండా.. యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు జీవనోపాధి పొందుతున్నారు. ఆ ప్రాంతంలో క్షిపణి దాడులు,  యుద్ధ వాతావరణం నెలకొంటే వారి భద్రత,  ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతాయి.   

చివరిగా.. నెతన్యాహు రహస్య పర్యటన అనేది కేవలం ఒక వ్యక్తి పర్యటనకు సంబంధించిన అంశం మాత్రమే కాదు..  అది పశ్చిమాసియాలో మారుతున్న నారేటివ్ ల యుద్ధానికి నిదర్శనం. ఇరాన్ అనుకూల వర్గాలు ఒకవైపు, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈ కూటమి మరోవైపు తమ ప్రాబల్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు శాంతి కాముకులు, ఎవరు యుద్ధ ప్రేరేపకులు అనే దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. భారత్ వంటి దేశాలు తమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ, ఈ మారుతున్న భద్రతా వలయాల మధ్య తన జాతీయ ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుందనేది ఇప్పుడు మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...