తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్ గా సైంటిస్ట్
posted on: Feb 5, 2026 1:56PM
.webp)
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ముగ్గురు అక్రమార్కులు అప్రూవర్లుగా మారారు. వీరేం రాజకీయనాయకులు కాదు.. బెదరింపులు, ప్రలోభాలకు లొంగి తప్పు చేసిన వారు. ఇప్పుడు ఈ ముగ్గురూ కూడా తాము తప్పు చేశామని అంగీకరించి పశ్చాత్తాపపడుతున్నారు. ఈ ముగ్గురిలో ఓ సైంటిస్టు కూడా ఉన్నారు. అలాగే ఓ రసాయినాల సరఫరా వ్యాపారి, భోలేబాబా డెయిరీ ఉద్యోగి కూడా ఉన్నారు. ఇక సైంటిస్ట్ ను ఎలా ప్రలోభపరిచారన్నది చూస్తే విస్మయం కలగక మానదు.
తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రొటోకాల్ మర్యాదలతో ఆ సైంటిస్ట్ బుట్టలో పడి నెయ్యి కల్తీ వ్యవహారంలో అక్రమార్కులకు అన్ని విధాలుగా సహకరించారు. వివరాల్లోకి వెడితే.. ఈ కేసులో డెయిరీ ఎక్స్‌పర్ట్ డాక్టర్ బత్తల సురేంద్రనాథ్ గత ఏడాది డిసెంబర్ లో కోర్టు ముందు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన తన నేరాన్ని అంగీకరించడమే కాదు, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా పూసగుచ్చినట్లు వివరించారు. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బెంగళూరులోని ప్రాంతీయ కేంద్రంలో రసాయన శాస్త్ర విభాగాధిపతిగా పని చేసిన సురేంద్రనాథ్ పదవీ విరమణ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి కొనుగోలు విషయంలో సలహాలు, సూచనలు, అవసరమైన నివేదికలు ఇస్తూ సహకరించారు.
టెండర్లలో పాల్గొనే డెయిరీలు, ప్లాంట్లను తనిఖీ చేసి, వాటి నెయ్యి తయారీ సామర్థ్యం పరిశీలించి నివేదికలు ఇచ్చేవారు. అందులో భాగంగా టీటీడీ నియమించిన ప్లాంట్ ఇన్‌స్పెక్షన్ కమిటీలో నెయ్యి నిపుణుడి హోదాలో సభ్యుడుగా పని చేశారు. డెయిరీ టెక్నాలజీ, ముఖ్యంగా నెయ్యికి సంబంధించి దేశంలోని అత్యున్నత స్థాయి సైంటిస్టుల్లో సురేంద్రనాథ్ కూడా ఒకరు. ఆయనకు టీటీడీలో కేవలం మార్కెటింగ్ జీఎం, ఈవో మినహా మరెవ్వరూ తెలియదు. ఏం మాట్లాడాలన్నా ఆయన నేరుగా వారిద్దరితోనే మాట్లాడే వారు. 2013 నుంచీ ఆయన టీటీడీకి సేవలందిస్తున్నారు.
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే వరకూ అంటే గత టీడీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరా, తనిఖీల విషయంలో ఆయన కచ్చితంగా వ్యవహరించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఆయన తీరు మారింది. కాదు కాదు మార్చేశారు. ఈ విషయాన్ని ఆయన కోర్టులో విస్పష్టంగా పేర్కొన్నారు. దీంతో తమ హయాంలో కల్తీయే జరగలేదంటూ వాదిస్తున్న వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. వైసీపీ హయాంలో పైవారి ఒత్తిడులు, ప్రలోభాలకు లొంగి తనిఖీల నివేదికలను వారికి కావలసిన విధంగా ఇచ్చినట్లు డాక్టర్ బత్తిన సురేంద్రనాథ్ కోర్టులో అంగీకరించారని తెలుస్తోంది.






