మోదీ చేసిన నోట్ల రద్దు... 'బంగారం' లాంటి నిర్ణయమా?

posted on: Mar 15, 2017 6:37PM

నవంబర్ లో మోదీ చేసిన నోట్ల రద్దు తీవ్రమైన కలకలం రేపింది! దేశ ఆర్దిక వ్యవస్థ కుప్పకూలిపోతోందంటూ చాలా మంది గుండెలు బాదుకునే దాకా వెళ్లింది. కాని, సీన్ కట్ చేస్తే... ఇప్పుడు నాలుగు నెలల తరువాత... మార్చ్ లో అంతా మారిపోయింది! నోట్లు రద్దు చేసిన మోదీకే అయిదు రాష్ట్రాల్లో దేశం నలుమూలలా జనం బ్రహ్మాండంగా మద్దతు పలికారు! భారీ మెజార్టీ ఇచ్చి సత్కరించారు! 

 

నోట్ల రద్దు వల్ల అప్పటికప్పుడు చాలా ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే! కాని, అత్యధిక భారతీయులు ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు క్యూలు కట్టినప్పుడు తాము దేశం కోసం కష్టపడుతున్నామని గర్వపడ్డారు! అందుకు తగ్గ ప్రతిఫలాలు ఇంతదాకా రాలేదు. ధరలేం భారీగా తగ్గిపోలేదు. పేద వాళ్లు ప్రశాంత్ గా ఏం జీవించటం లేదు. కాని, మోదీ పెద్ద నోట్ల రద్దు పైకి కనిపించని కోణాల్లో ఆర్దిక వ్యవస్థని బలిష్ఠం చేస్తూ వస్తోంది తనదైన రీతిలో! బంగారు భారతాన్ని ఆవిష్కరించేందుకు డీమానిటైజేషన్ తనవంతు సహకారం అందిస్తోంది!

 

నోట్ల రద్దుకు , బంగారానికి పైకి పెద్దగా సంబంధం వున్నట్టు కనిపించదు. కాని, గత నాలుగు నెలల్లో జరిగింది ఏంటంటే... మోదీ జనం చేతుల్లో డబ్బు లేకుండా చేశారు. వున్నదంతా బ్యాంకుల్లోకి పోయింది. బ్యాంకుల్లోంచి తిరిగి బయటకు రావటం చాలా కష్టమైపోయింది. అందుకే, చాలా మంది ఆన్ లైన్ లావాదేవీల మీద దృష్టిపెట్టారు. ఈ మొత్తం నోట్ల కటకటలో ఒక శుభపరిణామం ఏం జరిగిందంటే...

 

భారతీయులు బంగారం కొనటం తగ్గించేశారు. ఏకంగా 39శాతం బంగారు దిగుమతులు తగ్గిపోయాయి గత సంవత్సరం! 550 మెట్రిక్ టన్నులు మాత్రమే మనం బయట నుంచి తెచ్చుకున్నాం. 2009 తరువాత ఈ స్థాయిలో బంగారు కొనుగోలు తగ్గటం ఇదే మొదటిసారి! ఇక బంగారం కొనుగోళ్లు, విదేశాల నుంచి దాని దిగుమతులు తగ్గటం అంటే ఆర్దిక వ్యవస్థకి బలం చేకూరటం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా? బంగారం ఎంత తక్కువగా దిగుమతి అయితే అంత ఎక్కువగా రూపాయి మారకం విలువ పెరుగుతుంది. మోదీ డీమానిటైజేషన్ తో ఆ దిశగా తొలి అడుగులు పడ్డాయి. అయితే, ఇప్పటికీ 24వేల టన్నుల బంగారం మన ఇళ్లలో, గుళ్లలో వుందని ఒక అంచన! అందులో అత్యధిక శాతం బ్యాంకుల్లోకి చేరి ఆర్దిక వ్యవస్థకి అండగా వుంటేనే భారతదేశం నిజమైన బంగారు భారతంగా ఆవిర్భవించేది! దేశ భవిష్యత్ కోసం భారతీయులంతా బంగారంపై వ్యామోహం తగ్గించుకోవటం ఎంతైనా అవసరం! 

google-ad-img
    Related Sigment News
    • Loading...