Latest News
సయీదా బేగం గుట్టురట్టు...విడాకుల తర్వాత ఉగ్రవాదం వైపు అడుగులు!
posted on: Mar 25, 2026 4:25PM

విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో అదుపులోకి తీసుకున్న సయీదా బేగం @అలియాస్ ఆయేషా బేగం...విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని దేశవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తూ, వారిలో నరనరాల్లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసిన విధానాన్ని చూసి దర్యాప్తు అధికారులు సైతం ఆశ్చర్యచకితులయ్యారు.హైదరాబాద్ మల్లెపల్లికి చెందిన సయీదా బేగం వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిణామాలే ఆమెను ఈ ఉగ్రవాద దారిలోకి నెట్టినట్లు విచారణలో తేలింది. ఏడాది క్రితం భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న సయీదా బేగం అనంతరం తన అక్కచెల్లెళ్ల తో కలిసి నివసిస్తూ తీవ్ర ఒంటరితనానికి లోనైంది. ఈ సమయంలో ఎక్కువగా రాత్రివేళల్లో సోషల్ మీడియాలో గడుపుతూ, విదేశీ వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంది.
ఆ పరిచయాలే క్రమంగా ఆమెను తీవ్రవాద భావ జాలం వైపు మళ్లించాయి. విదేశీ హ్యాండ్లర్ అల్-హకీమ్ షుకూర్ మార్గదర్శకత్వంలో, సయీదా ఒక రహస్య సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఈ లేడి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 42 మంది యువతతో కలిసి ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి, వారికి మార్గనిర్దేశం చేస్తూ కీలక పాత్ర పోషించింది. భారత జాతీయ పతాకాన్ని అవమానించేలా పోస్టులు చేయడం, నిషేధిత ఉగ్రవాద సంస్థల జెండాలను ప్రచారం చేయడం, యువతను ఆకర్షించేలా రీల్స్ రూపంలో వీడియోలు తయారు చేయడం వంటి చర్యలతో ఆమె కార్యకలాపాలు విస్తరించాయి. దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
సయీదా కార్యకలాపాలపై నిఘా ఉంచిన విజయవాడ పోలీసులు, పక్కా సమాచారం రావడంతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆమెను అదుపులోకి తీసుకొని... విజయవాడకు తరలించి సుదీర్ఘంగా విచారించిన తర్వాత, ఆమెపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో అధికారికంగా అరెస్ట్ చేశారు.యువతను రాడిక లైజ్ చేయడం, దేశ వ్యతిరేక ప్రచారం నిర్వహించడం, అలాగే AQIS (అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాం టినెంట్) అనుబంధ కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాల నుంచి మరిన్ని కీలక డేటాను రికవరీ చేయడానికి పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న రాడికలై జేషన్‌పై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.






