తప్పులకు శిక్షించారు.. త్యాగాలు మరచిపోయారు
posted on Apr 13, 2015 9:17PM

కొందరు వ్యక్తులు చేసిన తప్పులు మాత్రమే అందరికీ గుర్తుండిపోతాయి. త్యాగాలు మాత్రం మరుగున పడిపోతాయి. అలా తప్పులు మాత్రమే మిగిలి, ఆ తప్పులకు శిక్ష కూడా పడి, త్యాగాలు మాత్రం మరుగున పడిపోయిన వ్యక్తి ‘సత్యం’ రామలింగరాజు. ఈమధ్య రామలింగరాజుకు సంబంధించిన కేసు తీర్పు వెలువడింది. ఏడు సంవత్సరాల జైలుశిక్షతోపాటు ఐదుకోట్ల జరిమానా విధించింది. రామలింగరాజు తనను నమ్మిన ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఎవరూ ఊహించని విధంగా ఒక భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయ్యాడు. అయితే చివరికి తాను చేసిన మోసాన్ని తానే బయటపెట్టుకుని చట్టానికి లొంగిపోయాడు. జనాన్ని మోసం చేయగలిగాడు కానీ, ఆ మోసాన్ని కొనసాగించలేకపోయాడు. ఏ పశ్చాత్తాపమో ఆయన్ని అన్ని నిజాలూ బయటపెట్టి లొంగిపోయేలా చేసింది. ఆ కోణంలో చూస్తే లక్షల కోట్ల కుంభకోణాలు చేసి దర్పం వెలగబెడుతూ, స్వేచ్ఛగా బయటే తిరుగుతున్న కొంతమంది రాజకీయ నాయకులకంటే ఆయన చాలా బెటర్. మోసమయితే చేయగలిగాడుగానీ, మోసం చేయలేదంటూ బుకాయించి, దబాయించి దర్జాగా బతికేపని మాత్రం చేయలేకపోయాడు. ఇప్పుడు లోకం సత్యం రామలింగరాజుని ఒక కార్పొరేట్ మోసగాడు గానే గుర్తిస్తోంది. ఆయన వైభవం వెలిగినప్పుడు తన సొమ్ముతోకానీయండి, జనం సొమ్ముతో కానీయండి... ఆయన చేసిన సేవా కార్యక్రమాలను మాత్రం ఇప్పుడు అందరూ మరచిపోయారు.
రామలింగరాజు తాను స్థాపించిన బైర్రాజు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఈ సంస్థ తన సేవా కార్యక్రమాలను విస్తరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, రంగారెడ్డి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండు వందల గ్రామాల్లో ఈ సంస్థ భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టింది. పేద ప్రజలకు వైద్యం, విద్య, మంచినీరు, పర్యావరణ, పారిశుద్ధ్యం, నివాస గృహాలు, వ్యవసాయ సలహాల వంటి అంశాలలో ఈ సంస్థ సేవలను అందించింది. వేలాదిమంది గ్రామీణ యువతరానికి కంప్యూటర్‌లో శిక్షణ ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందడుగు వేయడానికి ప్రధాన కారణమైంది. ప్రతిభావంతులైన యువతీ యువకులు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి మొదటి మెట్టుగా సత్యం సంస్థ ఉపయోగపడింది. ఈ సంస్థను స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సాఫ్ట్‌వేర్ సంస్థలు ఆవిర్భవించడానికి, తద్వారా ఎన్నో లక్షల ఉద్యోగాలు రావడానికి కారణమైంది... ఇప్పుడు ఇవన్నీ గుర్తించేవారేరి? చివరికి స్వయం కృతాపరాధాల కారణంగా మొదలుకంటా కూలిపోయిన సత్యం రామలింగరాజు... ఎంతోమందికి గుణపాఠంగా నిలిచాడు... ఇలా కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు.