ఎమ్మెల్యేలు క్యాంపుల్లో... శశి, పన్నీర్ టెన్షన్లో... జనం అయోమయంలో!

 

మీకు కబాలీ ట్రైలర్ లో చూపించిన రజినీకాంత్ డైలాగ్ గుర్తుండే వుంటుంది! గళ్ల లుంగీ కట్టుకుని, వంగి వంగి సలామ్ చేసే వాడ్ని కాదు... కబాలీని అంటూ ... రజినీ చెలరేగిపోతాడు ఆ డైలాగ్ లో! ఇప్పుడు సోషల్ మీడియాలో పన్నీర్ సెల్వం పై అదే డైలాగ్ ని ఉపయోగిస్తున్నారు నెటిజన్స్! నిన్న మొన్నటి వరకూ అమ్మ, చిన్నమ్మ ఎవరు పిలిచినా ఎంతో వినయంగా నమస్కారం చేసేవాడు పన్నీర్. కాని, గత కొన్ని రోజుల్లో సీన్ మారిపోయింది. పన్నీర్ శశికళ చేత కన్నీర్ పెట్టిస్తున్నాడు. తన అసలు సత్తా చాటుతున్నాడు. ఇంకా ఆటాలో గెలుపు ఆయనదని తేలిపోలేదు కాని గడుస్తున్న ఒక్కో గంటా శశికళ ముఖంలో కళ తగ్గిపోయేలా చేస్తోంది...

 

ఒకవైపు కోర్టు తీర్పు అతి త్వరలో వెలువడనున్నా దూకుడుగా సీఎం పదవి కోసం రంగంలోకి దిగిన శశి అదే కంటిన్యూ చేస్తోంది ఇంకా. ఆమె తనకు మద్దతు పలికిన ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లి భద్రంగా దాచేశారు. వాళ్ల సంఖ్య నూటా ముప్పై ఒకటి అంటూ గవర్నర్ కి లిస్ట్ కూడా ఇచ్చారు. రిసార్ట్స్ లో కనీసం సెల్ ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా గోడౌన్ లో దాచిన బ్లాక్ సరుకులా మార్చేసింది ఎమ్మెల్యేల్ని. ఇదంతా ఆమెకు జనంలో చెడ్డ పేరు తెస్తోంటే పన్నీర్ మాత్రం తెలివైన ఆట ఆడుతున్నాడు. తనకు ఎమ్మెల్యేల బలం లేకున్నా గవర్నర్ ని కలిసి వచ్చిన ఆయన ధర్మం గెలుస్తుందని ప్రకటించాడు! అమ్మ అభిమతం కూడా తాను సీఎంగా వుండాలనే అంటూ జనానికి చెప్పకనే చెప్పాడు.

 

గవర్నర్ ని కలిసిన పన్నీర్ సెల్వం ఆత్మ విశ్వాసంతో మీడియా ముందుకు వస్తే శశికళ మాత్రం మాట్లాడకుండా వెళ్లిపోయింది. దీనిబట్టి ఆమెకు విద్యాసాగర్ రావు నుంచి పాజిటివ్ సంకేతాలు రాలేదనే చెప్పుకోవాలి. బలపరీక్ష అంతకంతకూ లేట్ అయ్యేలానే కనిపిస్తోంది. ఇక ఇంతలో సుప్రీమ్ తీర్పు వచ్చేస్తే... సీన్ మొత్తం మారిపోవటం ఖాయం! శశికళ దోషిగా జైలుకి వెళ్లాల్సి వస్తే సీఎం పీఠంపై ఆమె పెట్టుకున్న ఆశలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి! సెల్వంకు సీఎంగా కొనసాగేందుకు దాదాపు ఎలాంటి అడ్డూ వుండదు!

 

శశికళ ఒకవేళ దోషిగా కాక నిర్దోషిగా బయటపడినా ఆమెకు పరీక్ష కాలం కొనసాగే అవకాశాలే వున్నాయి. సోమవారం తీర్పు వచ్చే అవకాశం వున్నందున గవర్నర్ మంగళవారం నుంచి ఎప్పుడైనా బల పరీక్షకు ఛాన్స్ ఇవ్వవచ్చు. ఇంతలోపు పన్నీర్ డీఎంకే, కాంగ్రెస్ పార్టీల లోపాయికారి మద్దతు కూడగడితే శశికళకు చుక్కలు కనిపించడం గ్యారెంటీ. ఆఫ్ట్రాల్ ఆమె ముఖ్యమంత్రి కావటం డీఎంకే నాయకుడు స్టాలిన్ కూడా ఇష్టం లేదు. కేంద్రంలోని బీజేపి పెద్దలకు సైతం శశికళపైన సద్భావం లేదు. వీటన్నిటి దృష్ట్యా పన్నీర్ తాను గెలవాలని ప్రయత్నించకున్నా ... శశికళ వ్యతిరేక శక్తులే ఆయన్ని గెలిపించే బాధ్యత భుజాన వేసుకునే అవకాశం వుంది!

 

గవర్నర్ చెన్నైలో దిగి నేరుగా పరిస్థితి సమీక్షించారు కాబట్టి మరో రెండు మూడు రోజులు ఉత్కంఠ కొనసాగించి సోమవారం సుప్రీమ్ తీర్పు తరువాత క్లైమాక్స్ కి ప్లాన్ చేయవచ్చు. అప్పటి దాకా శశికళ, పన్నీర్ సెల్వంతో పాటూ అందరికీ సస్పెన్స్ తప్పక పోవచ్చు!

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu