ఏపీలో వైద్యరంగ విప్లవం..సంజీవని పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

posted on: Jun 27, 2026 4:51PM

 

భవిష్యత్ లో ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు జనాభా తగ్గుదలపై సీఎం కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంపూర్ణ ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్’  ను శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతులకు సాగు సాయం వంటి పథకాలను ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని, లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు వదిలి సర్కారు బడుల్లో చేరడమే దీనికి నిదర్శనమన్నారు.

వైద్య సేవలను డిజిటలైజ్ చేస్తూ తీసుకొచ్చిన సంజీవని పథకం భవిష్యత్తులో ఒక ‘గేమ్ ఛేంజర్’ కాబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా డిజిటల్ హెల్త్ రికార్డులు జారీ చేస్తామని, ‘మన మిత్ర’ ప్రతినిధుల ద్వారా ప్రజల ఇంటి వద్దకే అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ వినూత్న ఆరోగ్య కార్యక్రమాన్ని రాబోయే ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో విస్తరిస్తామని సీఎం ప్రకటించారు.

ఇదే వేదికపై నుంచి దేశంలో తగ్గుతున్న జనాభా రేటుపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో మానవ వనరులే మనకు పెద్ద ఆస్తి అని, అందుకే ఇకపై ‘ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు’ అనే నినాదాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు యువతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్చుకుని ప్రపంచంతో పోటీ పడాలని సూచించారు.

మరోవైపు గత వైసిపి ప్రభుత్వ అనాలోచిత విధానాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అమరావతి రాజధానిని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును గాలికొదిలేశారని, వెలిగొండ పనులను పూర్తి చేయకుండానే నాటి పాలకులు నాటకాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో నదుల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.

ఇటీవలి రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, ప్రతిపక్ష పార్టీ కేవలం కుల రాజకీయాలు చేస్తోందని సీఎం దుయ్యబట్టారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను, హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని వైసిపి నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, ఆడబిడ్డల జోలికి వచ్చే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర శ్రేయస్సు కోసమే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో సంజీవని పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అత్యాధునిక హెల్త్ కేర్ సిస్టమ్ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తే, సామాన్యులకు సైతం వైద్య ఖర్చుల భారం తప్పి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతమవుతుందని సామాజిక విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...