అశిష్ గవాయ్ ఓవరేక్షన్!
posted on Jan 19, 2025 7:30AM
.webp)
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన, ... తిరుమలలో అగ్నిప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఓవర్ యాక్షన్ చేశారు. తిరుమల ఘటనలపై తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొంటూ టీటీడీలో క్రౌడ్ మేనేజ్‌మెంట్, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష నిర్వహిస్తారనీ, ఆది సోమవారాల్లో (జనవరి 19, 20) ఆయన తిరుమలలో పర్యటించి సమీక్షించి కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారనీ పేర్కొంటూ అధికారిక లేఖ రాశారు. అందకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా టీటీడీని ఆదేశించారు.
సరిగ్గా అమిత్ షా ఏపీ పర్యటనలో ఉండగా వచ్చిన ఈ లేఖ సంచలనం సృష్టించింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, రాష్ర పర్యటనలో ఉన్న అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన సైతం నిర్ఘాంత పోయారు. టీటీడీ కేంద్రం పరిధిలోకి రాదు. అయినా రాష్ట్ర పరిధిలోని సంస్థలకు అలా నేరుగా లేఖ పంపే అధికారం కేంద్ర హోంశాఖకు లేదు. ఏదైనా సమాచారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే పంపించాల్సి ఉంటుంది. ఆ కనీస అవగాహన కూడా లేకుండా విపత్తు నిర్వహణ డైరెక్టర్ అశిష్ గవాయ్ అధికారిక లేఖ పంపడం, అదీ నేరుగా టీటీడీ చైర్మన్ కే పంపడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కేంద్ర హోంశాఖ ముఖ్యులతో చర్చించారు. వారు తిరుమలలో సమీక్ష పై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ స్పష్టం చేశారు. అంతే కాకుండా శనివారం (జనవరి 18) రాత్రికి రాత్రే కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్షిస్తారంటూ వచ్చిన లేఖను ఉప సంహరించుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ టీటీడీ ఈవోకు అధికారిక సమాచారం పంపింది.