Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఉద్ధవ్ థాక్రేకు షాక్!
posted on: Jun 18, 2026 3:38PM

ఠాక్రే వారసుడికి చుక్కలు చూపిసున్న బండు భాయ్...
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మరోసారి ఊహించని మలుపు తిరిగింది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) వర్గంలో భారీ చీలిక దాదాపు ఖారారైంది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం ఈ అంతర్గత సంక్షోభాన్ని పూర్తిగా బయటపెట్టింది. ఈ పెను మార్పులకు కేంద్ర బిందువుగా, తిరుగుబాటు వర్గానికి నేతృత్వం వహిస్తున్న పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్) పేరు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మారుమోగుతోంది.
ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) లోక్‌సభలో మొత్తం తొమ్మిది (9) మంది ఎంపీల బలాన్ని కలిగి ఉంది. అయితే, పార్టీ జారీ చేసిన స్పష్టమైన విప్ ఉన్నప్పటికీ గురువారం నాటి సమావేశానికి కేవలం ముగ్గురు (3) ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మినహా మిగిలిన ఆరుగురు (6) ఎంపీలు ఈ కీలక భేటీకి గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు సాధారణమైనది కాదు, పార్టీలో సంభవించిన నిశ్శబ్ద విప్లవానికి ఇది నిదర్శనంగా మారింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండాలంటే మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ అవసరం. సరిగ్గా తొమ్మిది మందిలో ఆరుగురు ఎంపీలు ఏకతాటిపైకి రావడంతో, వారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి లేఖ సమర్పించినట్లు సమాచారం.
ఈ తిరుగుబాటు వర్గానికి బలమైన గొంతుకగా నిలిచిన సంజయ్ హరిభావు జాధవ్, శివసేనలో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకుడు. స్థానిక ప్రజలు ఆయన్ను ఎంతో ఆప్యాయంగా ‘బండు భాయ్’ అని పిలుచుకుంటారు. పర్భణీ నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఆయన, సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించిన ఆయన, ఆ తర్వాత అదే పర్భణీ లోక్‌సభ స్థానం నుండి వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి ఎంపీగా సత్తా చాటారు. బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే కరడుగట్టిన శివసైనికుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
అయితే, సంజయ్ జాధవ్‌కు పార్టీ అధిష్ఠానంతో విభేదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2020 సంవత్సరంలో మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వ హయాంలో మిత్రపక్షమైన ఎన్సీపీ (NCP) వైఖరి పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ కేడర్‌కు న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో అప్పట్లో తన ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో ఉద్ధవ్ థాక్రే స్వయంగా జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఆయన శాంతించారు. కానీ, లోలోపల రగులుతున్న అసంతృప్తి ఇప్పుడు పూర్తిస్థాయి తిరుగుబాటుకు దారితీసింది.
ఈ పరిణామాలపై ఉద్ధవ్ సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. ఎంపీలను ప్రలోభపెట్టేందుకు ఒక్కొక్కరికి ఏకంగా ₹50 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారంటూ గుర్రపు వ్యాపారం (హార్స్ ట్రేడింగ్) ఆరోపణలు చేశారు. రాత్రికి రాత్రే ₹15 కోట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. "పార్టీ సమావేశానికి రాని వారు మనవారు కాదు, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనప్పటికీ, సంజయ్ బండు జాధవ్ వంటి ఒక సీనియర్ మరియు మాస్ లీడర్ నేతృత్వంలో ఈ చీలిక జరగడం ఉద్ధవ్ థాక్రే శిబిరానికి కోలుకోలేని పెద్ద రాజకీయ దెబ్బ అనడంలో ఎలాంటి సందేహం లేదు.






