ప్రభుత్వం సంజయ్ దత్త్ కు క్షమాభిక్ష ఇస్తుందా

 

బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కి 1993 ముంబై బాంబు ప్రేలుళ్ళ కేసులో అక్రమంగా ఆయుధాలు కలిగిన నేరంలో ఇటీవలే సుప్రీం కోర్టు 5 సం.ల జైలు శిక్ష విదించిన సంగతి తెలిసిందే. నాటి నుండి ఆయనకు క్షమాభిక్ష పెట్టలని కొందరు, వద్దని మరి కొందరూ వాదనలు మొదలు పెట్టడంతో ఖిన్నుడయిన సంజయ్ దత్త్ మీడియాతో మాట్లాడుతూ తనకు క్షమాభిక్ష అవసరం లేదని, సుప్రీం కోర్టు తీరుపుకు కట్టుబడి జైలు శిక్ష అనుభవించేందుకు సిద్దంగా ఉన్నానని, అందువల్ల తన కోసం ఎవరూ కూడా ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరవద్దని ఆయన అన్నారు. అయినప్పటికీ, ఆయనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా అనేక మంది మహారాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ శంకర్ నారాయణన్ కి లేక్షలు వ్రాసారు. సంజయ్ దత్త్ కు క్షమాబిక్ష పెట్టమని కోరుతూ వ్రాసిన వారిలో అలనాటి నటి మరియు ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు జయప్రద కూడా ఒకరు. సంజయ్ దత్త్ సత్ప్రవర్తన మరియు సినిమా రంగానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు క్షమాభిక్ష పెట్ట వలసిందిగా ఆమె గవర్నర్ కు లేఖ వ్రాసారు. అయితే, సంజయ్ దత్త్ క్షమాభిక్షపై చెలరేగుతున్న రాజకీయ దుమారం చూసిన తరువాత దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా అది మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉందని భావించిన గవర్నర్, జయప్రద వ్రాసిన లేఖపై ఎటువంటి సలహాలు, సూచనలు చేయకుండానే మహారాష్ట్ర హోం శాఖకు పంపించేసారు. ఇంతకాలం సంజయ్ దత్త్ కు అనుకూలంగా మాట్లాడిన మహారాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఆయనకి క్షమాభిక్ష పెడుతుందా లేక దానిని కేంద్ర హోం శాఖకు పంపి చేతులు దులుపుకొంటుందో చూడాలి.