సానియా సవాల్‌ని కేటీఆర్ స్వీకరిస్తారా?

posted on: Oct 17, 2014 12:40PM

 

ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభమైన తర్వాత అలాంటి రకరకాల ఛాలెంజ్‌లు వ్యాప్తిలో వున్నాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఇలాంటి ఛాలెంజ్‌ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక కొత్త మలుపు తిప్పారు. ఆయన రూపొందించిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కార్యక్రమం ద్వారా దేశంలోని చెత్తని నివారించే పని మొదలుపెట్టారు. నరేంద్రమోడీ చేత చీపురు పట్టి చెత్తను ఊడ్చి, దేశంలోని కొంతమంది సెలబ్రిటీలకు ఇలా చేయండంటూ సవాల్ విసిరారు. వారిలో రిలయన్స్ అధినేత అనిల్ అబానీ కూడా వున్నారు. మోడీ పిలుపుకు స్పందించిన అనిల్ అంబానీ తాను కూడా చీపురు పట్టి చెత్త ఊడ్చి మరికొంతమందికి సవాల్ విసిరారు. వారిలో సానియా మీర్జా కూడా వున్నారు. తాజాగా సానియా మీర్జా కూడా చీపురు పట్టి చెత్త ఊడ్చి మరికొంతమందికి సవాల్ విసిరారు. వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) కూడా వున్నారు. ఇప్పుడే అసలు చిక్కు వచ్చి పడింది.

 

టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ అంటే ఎంతో అభిమానం. సానియా మీర్జాకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పదవి దక్కడానికి, రెండు విడతలుగా రెండు కోట్ల రూపాయలు దక్కడానికి ప్రధాన కారణం కేటీఆర్. అందుకే ఆయన మీద గౌరవాన్ని పెంచుకున్న సానియా మీర్జా ఆయనకు స్వచ్ఛ భారత్ సవాల్ విసిరారు. కేటీఆర్ కనుక సానియా సవాల్ స్వీకరించినట్టయితే తాను కూడా చీపురు పట్టి చెత్త ఊడ్చి మరికొంతమందికి సవాల్ విసరాల్సి వుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ అలా చేస్తారా అనేదే పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది.

 

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నిర్వహించింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ కార్యక్రమాన్ని ఎంతమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వాధినేతలు గానీ, ప్రభుత్వాధికారులు గానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమానికి దూరంగా వుందన్న అభిప్రాయాలు వున్నాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా సలహాకి స్పందించి కేటీఆర్ కనుక చీపురు పట్టి ఊడిస్తే ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం అనుసరించిన విధానానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. మరి ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తారో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...