సల్మాన్ మీద సానుభూతి ఎందుకో?



తప్పతాగి కారు నడిపి ఒక వ్యక్తి మరణానికి, కొంతమంది గాయపడటానికి కారణమైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి కోర్టు ఐదేళ్ళ జైలుశిక్ష విధించింది. నేరం జరిగిన 13  సంవత్సరాల తర్వాత అయినా కోర్టు తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే సల్మాన్‌కి శిక్ష పడిందని తెలియగానే చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు చాలా ఫీలైపోతూ ప్రకటనలు చేయడమే మన దేశంలోని దౌర్భాగ్యానికి సంకేతంగా నిలుస్తోంది. సల్మాన్ ఖాన్ వల్ల ఉపయోగం పొందినవాళ్ళో, ఆయన సన్నిహితులో సానుభూతి వ్యక్తం చేస్తే దాన్ని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవి లాంటి  వ్యక్తులు కూడా బోలెడంత ఫీలైపోతూ సల్మాన్‌కి అనుకూలంగా ప్రకటన చేయడం వెగటుగా వుంది. అసలు సల్మాన్‌ఖాన్‌ మీద సానుభూతి ఎందుకు వ్యక్తం చేయాలి? అతను తప్పతాగి యాక్సిడెంట్ చేశాడని కోర్టు నిర్ధారించింది. శిక్ష వేసింది. అంటే సల్మాన్ నేరం చేశారని అందరూ అంగీకరించి తీరాలి. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చాలామంది బాధ్యతాయుతమైన వ్యక్తులు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడమేంటి?

ఇంకొంతమంది వ్యవహారం చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థంకాని పరిస్థితి. సల్మాన్ ఖాన్ ఎన్నో మంచి పనులు, దాన ధర్మాలు చేశాడు కాబట్టి ఆయన్ని వదిలేయాలట. సల్మాన్ ఖాన్ కోర్టులో కన్నీరు పెట్టుకుని శిక్షను తగ్గించాలని కోరుకున్నాడు కాబట్టి శిక్షను తగ్గించేసేయాలట. సల్మాన్ ప్రముఖ హీరో కాబట్టి, ఆయన ఐదేళ్ళు జైల్లో వుంటే సినిమా పరిశ్రమ 250 కోట్లు నష్టపోతుంది కాబట్టి ఆయనకు శిక్ష విధించకుండా వదిలేయాట... ఏంటీ మినహాయింపులు? సల్మాన్ సినిమా స్టారో, దాన కర్ణుడో కాబట్టి ఆయనకు శిక్ష విధించకుండా వదిలేయాలా? ఇలా మినహాయింపులు కోరేవారికి అసలు మానవత్వం అనేది వుందా?  ప్రముఖులు నేరాలు చేసినా వదిలేస్తూ వుండాలా? సల్మాన్ మీద అంత ప్రేమ, అభిమానం వున్నవాళ్ళు ఆయన జైల్లోకి వెళ్ళే సమయంలో గేటు దగ్గర వీడ్కోలు పలకండి. సల్మాన్ జైల్లోంచి విడుదలయ్యే సమయంలో మళ్ళీ వెళ్ళి స్వాగతం పలకండి. అంతేగానీ, సల్మాన్‌కి శిక్ష పడటం దారుణం అన్నట్టుగా మాట్లాడకండి. వినడానికే అసహ్యంగా వుంది.