కారుతో నక్కని తొక్కించి వుంటాడు

 

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తప్పతాగి డ్రైవ్ చేసి ఒక నిండు ప్రాణం పోవడంతోపాటు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటానికి కారణమయ్యాడు. 2002లో జరిగిన ఈ కేసుకు సంబంధించి పదమూడేళ్ళ తర్వాత తీర్పు వెలువడింది. సల్మాన్ ఖాన్ తప్పతాగి డ్రైవ్ చేశాడని, అందువల్ల అతనికి ఐదేళ్ళ కారాగార శిక్ష విధిస్తున్నానని సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సల్మాన్‌కి కోర్టు ఇలా శిక్ష విధించిందో లేదో అలా నెత్తిన నీటి కుండలు పెట్టుకున్నట్టుగా కన్నీరు కార్చేవారు, సానుభూతితో ముక్కులు చీదేవారు ఎక్కువైపోయారు. బోలెడంత మంది బాలీవుడ్ నటీనటులు, దారినపోయే దానయ్యలు... వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా సల్మాన్‌కి శిక్ష పడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ధోరణి చూస్తే సల్మాన్ ఇంకో పదిమంది మీదకి కారు ఎక్కించి చంపేసినా క్షమించేయాల్సిందేనని, ఆయన మానవాతీతుడని అన్నట్టుగా వుంది. ఇలాంటి సానుభూతిపరుల ముక్కు చీదుళ్ళు, మూతి విరుపులు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనుకుంటున్న సమయంలో ముంబై హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. సల్మాన్ కేసును సెషన్స్ కోర్టు సరిగా విచారించలేదని, ఈ కేసును సరిగా విచారించాల్సి వుందని చెప్పింది. సల్మాన్‌కి సాధారణ బెయిల్ కూడా మంజూరు చేసింది. తద్వారా ఈ కేసును మళ్ళీ విచారించాలని చెప్పేసింది.

సెషన్స్ కోర్టు పదమూడేళ్ళపాటు విచారణ జరిపి సల్మాన్ ఖాన్ దోషి అని ఖరారు చేసి శిక్ష విధించింది. అయితే గౌరవనీయమైన ముంబై హైకోర్టు మాత్రం ఒకే ఒక్కరోజులో ఈ కేసు విచారణ సరిగా జరగలేదని డిసైడ్ చేసేసింది. ఇంత గొప్పగా అసలు వాస్తవాన్ని కనుక్కొన్న ముంబై హైకోర్టుకు హేట్సాఫ్ చెప్పడం ప్రతి భారతీయ పౌరుడి కర్తవ్యం. ఇంత గొప్పగా, ఇంత త్వరగా న్యాయాన్ని, అన్యాయాన్ని గ్రహించగలిగే గొప్ప న్యాయ వ్యవస్థ మనకు వున్నందుకు మనందరం గర్వపడాలి. అయితే కేసు విచారణ మళ్ళీ మొదలైతే, ఈ కేసులో కీలక సాక్షిగా వున్న రవీంద్ర పాటిల్‌ ఇప్పటికే చనిపోయారు. గతంలో ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటారో లేదో. మరి పరిగణనలోకి తీసుకోకపోతే ఆయన ఇప్పుడు మళ్ళీ సాక్ష్యం ఇచ్చే అవకాశం లేదు కదా.. అయినా ఇవన్నీ ఘనత వహించిన చట్టాలు, న్యాయాలు, కోర్టులు తేల్చాల్సిన విషయం. మనలాంటి సామాన్య పౌరులకు అర్థమయ్యే విషయం కాదు. అన్నట్టు సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఒకసారి తన కారుతో ఏ నక్కనో తొక్కి వుంటాడు. అందుకే లక్కు ఇలా దరిద్రం పట్టినట్టు పట్టింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu