భాగ్యనగరంలో గంజాయి కలిపిన పాల విక్రయాలు

posted on: Feb 18, 2026 11:13AM

 గంజాయి కలిపిన పాల విక్రయాలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్   బేగంబజార్ ప్రాంతంలో  ఈ గంజాయి పాల విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన   తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.  యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సాధారణ పాల విక్రయాల ముసుగులో నిషేధిత గంజాయి ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సాధారణ పానీయం తరహాలో అధికారుల కళ్లు గప్పి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

 పాలల్లో గంజాయి చాక్లెట్స్ కలిపి వినియోగదారులకు విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ శర్మను పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 17) అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం నిందితుడు గంజాయి పదార్థాలను చాక్లెట్ రూపంలో తయారు చేసి వాటిని పాలలో కలిపి విక్రయించడం ద్వారా   యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో మొత్తం 1,920 గంజాయి చాక్లెట్స్‌ బయటపడ్డాయి. ఈ చాక్లెట్స్‌ను అక్రమంగా నిల్వ చేసి భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు,  గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దృష్టి సారించారు. నిందితుడికి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి సరఫరా చేశాడనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...