క్రికెట్ లో ఇలా కూడా ఔటవుతారా?

posted on: May 27, 2026 9:27AM

ఐపీఎల్ 2026 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఒక విచిత్ర రీతిలో ఔటయ్యాడు.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం (మే 26) జరిగిన ఈ   హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది.  ఈ మ్యాచ్ లోమొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ  నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు.  

 కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్   దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం. అసలేం జరిగిందంటే.. జేకబ్ డఫీ  వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో  సాయి సుదర్శన్  అద్భుతమైన కట్ షాట్ ఆడాడు. ఆ బంతి ఎంతో వేగంగా పాయింట్ బౌండరీ వైపు దూసుకెళ్లి ఫోర్‌గా మారింది.   సరిగ్గా అదే సమయంలో ఒక విచిత్రం కూడా జరిగింది.  సాయి సుదర్శన్ షాట్  ఆడిన తరువాత అతడి చేతిలో ఉన్న బ్యాట్ జారిపోయింది. 

అలా జారిన బ్యాట్ కింద పడి, ఆ వెంటనే  నేరుగా స్టంప్స్‌ను తాకింది. దాంతో బెయిల్స్ కిందపడిపోయాయి. బంతి బౌండరీ లైన్ దాటినా, బ్యాట్ వెళ్లి వికెట్లను తాకడంతో సాయి సుదర్శన్ హిట్ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు.  9 బంతుల్లో 14 పరుగులు చేసి మంచి జోరుమీద ఉణ్న సాయి సుదర్శన్ ఔటైన విధానం చూసి అతడే కాకుండా, అందరూ విస్మయం చెందారు.  అదలా ఉంటే ఈ ఔట్ తో ఐపీఎల్ చరిత్రలోనే  రెండుసార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాటర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇంతకుముందు 2022 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ బౌలింగ్‌లో సుదర్శన్ మొదటిసారి  హిట్ వికెట్ అయ్యాడు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...