Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
posted on: Mar 17, 2026 6:42AM

తెలంగాణ గడ్డపై సాహిత్య పరిమళాలు మరోసారి దేశవ్యాప్తంగా గుబాళించాయి. ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన అనిమేష అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. దేశ వ్యాప్తంగా మొత్తం 24 భారతీయ భాషల్లో ఎంపిక చేసిన ఉత్తమ రచనలలో తెలుగు విభాగంలో నందిని సిధారెడ్డికి ఈ అవార్డు లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఉత్తేజపరిచే రచనలు చేసిన నందిని సిధారెడ్డి, ఈసారి సామాజిక సంక్షోభాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. అనిమేష కవితా సంపుటి ప్రధానంగా కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్ని, ఆ సమయంలో సామాన్యుడు అనుభవించిన నరకయాతనను ప్రతిబింబిస్తుంది. లాక్డౌన్ నాటి ఏకాంతం, మరణభయం, విడిపోయిన బంధాలను ఆయన తన కవిత్వంలో హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు.
నందిని సిధారెడ్డి ప్రస్థానం కవిత్వానికీ, సాహిత్యానికే పరిమితం కాలేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఆయన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సిధారెడ్డి గీతాలు గతంలో అనేక ప్రజాపోరాటాలకు ఊపిరిపోశాయి.
ప్రస్తుతం ఆయనకు దక్కిన ఈ గౌరవంపై తెలుగు సాహితీ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్థితులను మానవీయ కోణంలో అక్షరీకరించడం వల్లే ఈ అవార్డు దక్కింది. సిధారెడ్డి సరళతరమైన శైలి, మనసును హత్తుకునే భావ వ్యక్తీకరణ ఆయనను పాఠకులకు, ప్రజలకు చేరువ చేశాయి. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు, కవులు, రచయతలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.






