వామ్మో.. కుంకుమ పువ్వు టీ తాగితే ఇన్ని లాభాలా?
posted on Apr 26, 2025 11:24AM

కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంద ద్రవ్యం. దీన్ని సాధారణంగా ఖరీదైన వంటకాలలోనూ, తీపి పదార్థాల తయారీ లోనూ, గర్భవతులు, బిర్యానీ వంటి వంటకాలలోనూ ఉపయోగిస్తారు. అయితే కుంకుమ పువ్వుతో టీ తయారు చేసుకుని తాగుతారని మీకు తెలుసా? కుంకుమ పువ్వు చాలా ఖరీదైనదే అయినా దాని ఖరీదుకు తగినట్టు ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
జీర్ణక్రియ..
కుంకుమ పువ్వు టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల ఆహారం సజావుగా జీర్ణమవుతుంది.
నెలసరి..
నెలసరి సమస్యలు ఉన్నవారికి కుంకుమ పువ్వు టీ అద్భుతం అని చెప్పవచ్చు. కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల కడుపు కండరాల తిమ్మిరి, కడుపు ఉబ్బరం, అలసట, నెలసరికి ముందు, తరువాత వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
నిద్ర..
కుంకుమ పువ్వులో సఫ్రానల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనసుకు, మెదడుకు ప్రశాంతతను ఇస్తాయి. పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల మనసు, శరీరం రెండూ విశ్రాంతి పొందుతాయి. నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడేవారు, పదే పదే నిద్రలో మెలకువ వచ్చే వారు పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగితే చాలా మంచిది.
రోగనిరోధక శక్తి..
కుంకుమ పువ్వులో విటమిన్-సి, విటమిన్-బి, రిబోప్లేవిన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
రక్తపోటు, కొలెస్ట్రాల్..
కుంకుమ పువ్వులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి రక్తపోటును, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
బరువు..
ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎందుకంటే కుంకుమ పువ్వు టీ ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా కేలరీలు ఎక్కువ తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే కొద్దిపాటి ఫైబర్ చాలా శక్తివంతమైనది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కాన్సర్..
కుంకుమ పువ్వులో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయి.
చర్మ ఆరోగ్యం..
చర్మ ఆరోగ్యానికి కుంకుమ పువ్వు దివ్యౌషధం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పలు బ్యూటీ ఉత్పత్తులలో కూడా కుంకుమ పువ్వు ను వినియోగిస్తారు. కుంకుమ పువ్వు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...