రష్యా–భారత్ వ్యూహాత్మక బంధంలో సరికొత్త అధ్యాయం.. మిషన్ సుదర్శన చక్ర.!

posted on: Jul 17, 2026 4:21PM

భారత రక్షణ రంగ చరిత్రలో మరో   కీలక వ్యూహాత్మకమైన మైలురాయికి పునాది పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన,  అత్యాధునికమైన రక్షణ సాంకేతికతను స్వదేశీ పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు భారత్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ రక్షణ వర్గాల సమాచారం ప్రకారం..  రష్యా తన సరికొత్త  అడ్వాన్స్‌డ్ ఎస్ 500 (ప్రోమేతి) దీర్ఘశ్రేణి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ఆధారంగా భారత్‌తో కలిసి సంయుక్తంగా సరికొత్త రక్షణ కవచాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది.  మిషన్ సుదర్శన చక్ర గా పిలవబడుతున్న ఈ ప్రతిపాదన ద్వారా ఉభయ దేశాల రక్షణ బంధం నెక్ట్స్ లెవెల్ కు చేరుకోనుంది. ఇది కేవలం  ఆయుధ కొనుగోలు ఒప్పందం మాత్రమే కాదు..  సాంకేతిక బదిలీ, ఉమ్మడి పరిశోధనలు,  భారత్‌లోనే  తయారీ వంటి కీలకమైన అంశాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. గతంలో విజయవంతమైన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి ప్రాజెక్ట్ తర్వాత భారత్, రష్యాల మధ్య ఇదే అతిపెద్ద,  ప్రాధాన్యత కలిగిన రక్షణ ఒప్పందంగా మారనుంది.  ఈ  కొత్త కూటమి ద్వారా భారతదేశం తన   గగనతల భద్రతను పటిష్టం చేసుకోవడమే కాకుండా, అంతర్జాతీయంగా అమెరికా, చైనా, రష్యాల మధ్య వ్యూహాత్మక సమతుల్యతను కాపాడుకుంటూ తన సార్వభౌమత్వాన్ని చాటుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఆత్మనిర్భర్ భారత్" నినాదానికి ఈ ప్రాజెక్ట్   ఊతాన్ని ఇస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, అత్యున్నత సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసుకునే స్థాయికి భారత్ ఎదిగేందుకు ఈ మిషన్ సుదర్శన చక్ర దోహదపడుతుందనడంలో సందేశం లేదు. 

  బ్రహ్మోస్ నుండి ప్రాజెక్ట్ కుశా వరకు..  రక్షణ ప్రస్థానం

ఇండియా, రష్యాల   మధ్య రక్షణ సంబంధాలు నిన్న మొన్నటివి కావు, కోల్డ్ వార్ కాలం నుండి ఇరు దేశాల మధ్య  బలమైన వ్యూహాత్మక బంధం కొనసాగుతోంది. గడిచిన దశాబ్దాలలో మిగ్-21 యుద్ధ విమానాలు, సుఖోయ్-30 ఎంకేఐ, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, అణు జలాంతర్గాముల లీజింగ్ వంటి ఎన్నో కీలక ఒప్పందాలు భారత సైనిక సామర్థ్యాన్ని విశ్వవ్యాప్తం చేశాయి. వీటన్నింటిలో బ్రహ్మోస్ క్షిపణి ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్ట్ భారత రక్షణ సాంకేతికతలో సరికొత్త తలుపులు తెరిచింది. ఆ తర్వాత 2018 లో కుదిరిన దాదాపు 5.4 బిలియన్ డాలర్ల విలువైన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థల ఒప్పందం భారత వైమానిక దళానికి ఒక రక్షణ కవచంలా మారింది.  అదే సమయంలో..  ఇండియా  రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో స్వదేశీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ (బీఎండీ) ఫేజ్ 1, ఫేజ్ 2 లతో పాటు సుదూర శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ ప్రాజెక్ట్ కుశా  పై వేగంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇప్పుడు ప్రతిపాదించిన ఎస్-500 ఆధారిత మిషన్ సుదర్శన చక్ర ప్రాజెక్ట్, ఇండియా రక్షణ రంగ అవసరాలను తీర్చడమే కాకుండా..  కేవలం కొనుగోలుదారుగా ఉన్న స్థానం నుండి ఉమ్మడి సాంకేతిక భాగస్వామిగా భారత్‌ను నిలబెడుతుంది.   

2018 నాటి ఎస్-400 ఒప్పందంలో భాగంగా ఇప్పటికే మొదటి మూడు రెజిమెంట్లు భారతదేశానికి చేరుకుని పశ్చిమ,  ఉత్తర సరిహద్దులలో నిఘాను ముమ్మరం చేశాయి. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా మిగిలిన యూనిట్ల సరఫరాలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, నాలుగో స్క్వాడ్రన్ భారత్‌కు చేరిందని,  ఐదో యూనిట్ సైతం త్వరలోనే అందుబాటులోకి రానుందని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా గతంలో జరిగిన  ఆపరేషన్ సిందూర్  సమయంలో   ఎస్-400 వ్యవస్థ  అద్భుత  ప్రదర్శన కనబరిచింది. సరిహద్దు అవతల శత్రుదేశాల కదలికలను, ముఖ్యంగా పాకిస్తాన్ వైమానిక దళ సామర్థ్యాలను సుదూరం నుంచే  పసిగట్టి రక్షణ వ్యూహాలను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించింది.  ఈ  విజయాల నేపథ్యంలో భారత వైమానిక దళం తదుపరి తరం వ్యవస్థ అయిన ఎస్-500 కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, రష్యా తన సొంత సైనిక అవసరాలు,  పరిమిత ఉత్పత్తి సామర్థ్యం కారణంగా నేరుగా ఈ వ్యవస్థల ఎగుమతిని నిరాకరించింది. అయితే..  ప్రస్తుత అంతర్జాతీయ సమీకరణాల దృష్ట్యా రష్యా తన వ్యూహాన్ని మార్చుకుంది. నేరుగా విక్రయించడానికి బదులుగా, ఎస్ 500 సాంకేతికత ఆధారంగా భారత్‌తో కలిసి ఉమ్మడిగా  మిషన్ సుదర్శన చక్ర  కింద  కొత్త రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం ఇరు దేశాల రక్షణ బంధంలో ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పవచ్చు.  ఎస్-500 సాంకేతిక సామర్థ్యం,  నేషనల్ మిస్సైల్ షీల్డ్ రూపకల్పన రష్యాకు చెందిన ఎస్ 500 ప్రోమేతి వ్యవస్థ ప్రపంచంలోనే   అధునాతన గగనతల రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఇది కేవలం సాధారణ విమానాలను మాత్రమే కాకుండా శత్రువుల బాలిస్టిక్ క్షిపణులు, అత్యంత వేగంగా దూసుకువచ్చే హైపర్‌సోనిక్ ఆయుధాలు, క్రూయిజ్ క్షిపణులు, రాడార్లకు దొరకని స్టెల్త్ ఫైటర్ జెట్లతో పాటు భూమికి అతి తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలోని  లక్ష్యాలను కూడా విజయవంతంగా ధ్వంసం చేయగలదు.

ఈ వ్యవస్థ   600 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను   ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.   మిషన్ సుదర్శన చక్ర  ప్రాజెక్ట్ ద్వారా భారతదేశంలో ఒక బహుళ అంచెల   సమగ్ర గగనతల రక్షణ నెట్‌వర్క్ రూపుదిద్దుకోనుంది. ఇందులో ఇప్పటికే ఉన్న ఎస్-400 వ్యవస్థలు, భవిష్యత్తులో రాబోయే ఎస్-500 సాంకేతికత, డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్ కుశా, స్వదేశీ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ఆస్తులు అన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయి. వీటన్నింటినీ అత్యాధునిక లాంగ్ రేంజ్ రాడార్లు, శాటిలైట్ ట్రాకింగ్,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో అనుసంధానించడం ద్వారా భారతదేశం చుట్టూ ఒక అభేద్యమైన  నేషనల్ మిస్సైల్ షీల్డ్  ఏర్పడుతుంది. దీనివల్ల చైనా, పాకిస్తాన్ వంటి సరిహద్దు దేశాల నుండి ఎదురయ్యే ఎలాంటి క్షిపణి ముప్పునైనా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలదు.  అంతర్జాతీయ చట్టాలు, కాట్సా ఆంక్షలు, వ్యూహాత్మక స్వతంత్రత ఈ తరహా అత్యున్నత రక్షణ సాంకేతికతను ఉమ్మడిగా అభివృద్ధి చేయడం అంతర్జాతీయ చట్టాలు,  క్షిపణి సాంకేతిక నియంత్రణ ఒప్పందం పరిధిలోకి వస్తుంది. భారత్, రష్యాలు రెండూ ఈ నియంత్రణ వ్యవస్థలో సభ్యదేశాలు అయినప్పటికీ, పూర్తి స్థాయి క్షిపణుల ఎగుమతులపై ఉన్న నిబంధనలు ఉమ్మడి పరిశోధనలకు,  సాంకేతిక బదిలీకి  అడ్డంకి కాకపోవచ్చు. అయినప్పటికీ..  ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అంశంగా మారుతుందనడంలో సందేహం లేదు.  గతంలో రష్యా నుండి ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసిన సమయంలో అమెరికా తన  కాట్సా  చట్టం కింద భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉందనే చర్చ గట్టిగా నడిచింది. కానీ భారతదేశంతో ఉన్న వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా వాషింగ్టన్ చివరకు ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎస్ 500 సాంకేతికత ఉమ్మడి అభివృద్ధి తెరపైకి రావడంతో అమెరికా ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. అయితే, ఇండియా మొదటి నుండి తన  వ్యూహాత్మక స్వతంత్రత  విధానానికి కట్టుబడి ఉంది. తన జాతీయ భద్రతకు అవసరమైన ఏ నిర్ణయాన్నైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు భారత్‌కు ఉందని, ఏ ఒక్క అంతర్జాతీయ కూటమికి తాము బందీలం కాబోమని ఇండియా ఇప్పటికే స్పష్టం చేసింది.

 ప్రాంతీయ శక్తి సమతుల్యత,  అంతర్జాతీయ వేదికలపై దేశీయ చర్చలు రష్యా అందించిన ఈ ఎస్ 500 ఉమ్మడి అభివృద్ధి ప్రతిపాదన అంతర్జాతీయ మీడియాలో,  రక్షణ విఅనలిస్టులలో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా చైనా ఇప్పటికే హెచ్‌క్యూ 9, హెచ్‌క్యూ 19 వంటి అధునాతన రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, పాకిస్తాన్ సైతం చైనా సహాయంతో తన వాయు రక్షణను బలోపేతం చేసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎస్ 400, ఎస్ 500, ప్రాజెక్ట్ కుశా,  బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థల కలయికతో ఒక సూపర్ లేయర్డ్ రక్షణ కవచాన్ని నిర్మిస్తే..  అది ఆసియా ఖండంలో ప్రాంతీయ శక్తి సమతుల్యతను పూర్తిగా మార్చివేస్తుంది.  దేశీయంగా చూసుకుంటే, ఈ ఒప్పందం కేవలం విదేశీ సాంకేతికతను ఇక్కడ అసెంబుల్ చేయడం మాత్రమే కాకుండా,  కో-డిజైన్, కో-డెవలప్,  కో-మాన్యుఫ్యాక్చర్  నమూనాలో సాగుతుంది.

దీనివల్ల ఇండియన్ సైంటిస్టులకు, స్థానిక రక్షణ రంగ పరిశ్రమలకు ప్రపంచ స్థాయి క్షిపణి సాంకేతికతను నేర్చుకునే, సొంతంగా  అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. మరోవైపు పాశ్చాత్య దేశాలు,  క్వాడ్   కూటమిలో భారత్ భాగస్వామ్యంపై ఈ రష్యా డీల్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి. కానీ భారత్ ఎప్పటికప్పుడు అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో సంబంధాలు కొనసాగిస్తూనే..  రష్యాతో తన ప్రత్యేక బంధాన్ని కాపాడుకునే  మల్టీ-అలైన్‌మెంట్  విధానాన్ని  ముందుకు తీసుకెళ్తోంది.  

మిషన్ సుదర్శన చక్ర ప్రాజెక్ట్ కాగితంపై అత్యంత ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, దీని అమలులో కొన్ని కీలకమైన సవాళ్లు,  ఆర్థిక సమీకరణాలను రక్షణ శాఖ నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇండియా ఇప్పటికే అంతర్గతంగా ప్రాజెక్ట్ కుశా, స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థలపై భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. ఇటువంటి తరుణంలో రష్యాతో కలిసి ఎస్ 500 ఆధారిత సరికొత్త ప్రాజెక్ట్‌ను చేపట్టడం ఆర్థికంగా ,  కార్యాచరణ పరంగా ఎంతవరకు లాభదాయకం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  అంతేకాకుండా, ప్రస్తుత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం  రష్యా దేశీయ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలపై పడుతున్న ప్రభావం,  పాశ్చాత్య దేశాల ఆంక్షల తీవ్రత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రష్యా నుండి సాంకేతికత సకాలంలో అందుతుందా లేదా అనే  రిస్క్‌లను కూడా భారత్ అంచనా వేయాల్సి ఉంటుంది. కానీ.. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ ల నుండి పొంచి ఉన్న ద్విముఖ ముప్పు ఆధునిక హైపర్‌సోనిక్ ఆయుధాల భయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, భారతదేశానికి ఒక అభేద్యమైన జాతీయ క్షిపణి రక్షణ కవచం  ఏర్పాటు చేసుకోవడం విలాసం కాదు, అది దేశ అస్తిత్వ భద్రతకు సంబంధించిన   అనివార్యమైన అవసరం. 

భారత రక్షణ రంగంలో సుదర్శన చక్రం ప్రస్తుతానికి రష్యా అందించిన ఈ ఎస్ 500 ఉమ్మడి రక్షణ వ్యవస్థ ప్రతిపాదన చర్చల దశలోనే ఉన్నప్పటికీ, ఇది కార్యరూపం దాల్చితే  అది  భారత రక్షణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. భారతదేశం కేవలం విదేశీ ఆయుధాలను కొనుగోలు చేసే దేశం అనే ముద్రను చెరిపేసి, ప్రపంచ స్థాయి రక్షణ సాంకేతికతను ఉమ్మడిగా సృష్టించే ఒక గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా అవతరించేందుకు ఈ ప్రాజెక్ట్ మైలురాయి అవుతుంది.  ఇండో, పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం ఒక తిరుగులేని శక్తుగా ఎదగాలన్నా, దేశంలోని కీలక నగరాలు, పారిశ్రామిక కేంద్రాలు,  సైనిక స్థావరాలను శత్రువుల కంటికి కనబడని క్షిపణి దాడుల నుండి కాపాడుకోవాలన్నా ఇటువంటి బహుళ అంచెల రక్షణ కవచం  అవసరం.  రష్యా ప్రతిపాదించిన   మిషన్ సుదర్శన చక్ర  ఆ దిశగా భారతదేశాన్ని  శక్తివంతంగా మార్చడంలో ఒక విప్లవాత్మక అడుగు కాబోతోంది. భవిష్యత్తులో ఇరు దేశాలు  సాంకేతిక   రాజకీయ సవాళ్లను అధిగమించి ఈ ఒప్పందాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాయో చూడాలి.  

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...