రైతులకు గుడ్ న్యూస్: ఒకే విడతలో రైతు భరోసా నిధులు!

posted on: Jun 23, 2026 11:36AM

తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ఎంతో కాలంగా రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈసారి ఒకే విడతలో మొత్తం నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతుల్లో కొత్త ఆశలు, ఆనందాలు చిగురిస్తున్నాయి.

ఈ భారీ నిధుల విడుదల కార్యక్రమానికి జూన్ 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో వేదిక సిద్ధమవుతోంది. అక్కడ నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా కంప్యూటర్ బటన్ నొక్కి ఒకే క్లిక్‌తో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు బదిలీ చేయనున్నారు. ఈ క్రతువును అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఇప్పటికే కొత్త పాస్‌బుక్‌ల వివరాలను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ (CCLA) ద్వారా సేకరించి, లబ్ధిదారుల జాబితాను సర్వం సిద్ధం చేసింది.

ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది రైతులకు ఈ విడతలో రైతు భరోసా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.9,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. అయితే ఈసారి నిధుల పంపిణీలో ప్రభుత్వం పక్కా నిబంధనలను అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సాగులో లేని రోడ్లు, కొండలు, గుట్టలకు కూడా నిధులు వెళ్లాయని భావించిన ప్రభుత్వం, ఈసారి కేవలం వాస్తవంగా సాగు చేస్తున్న భూములకు మాత్రమే భరోసా ఇస్తామని తెగేసి చెప్పింది. తెలంగాణలో మొత్తం 1.50 కోట్ల ఎకరాల భూమి ఉండగా, అందులో దాదాపు 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, కుంటలు మరియు బీడు భూములుగా మారినట్లు ప్రభుత్వ లెక్కలు తేల్చాయి. అందుకే ఆ భూములను ఈ పథకం నుండి పూర్తిగా మినహాయించారు.

గత యాసంగి (రబీ) సీజన్‌లో కేవలం రెండు ఎకరాల లోపు ఉన్నవారికే నిధులు అందడంతో రైతాంగంలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఆ అసంతృప్తిని పోగొట్టేలా ఈసారి ఖరీఫ్ సీజన్‌కు గాను 7 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఒకే విడతలో నిధులు జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకే విడతలో ఈ భారీ పెట్టుబడి సాయం అందుతుండటంతో వ్యవసాయ పనుల్లో వేగం పుంజుకోనుంది. జూన్ 20న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 23వ విడత నిధులను, అలాగే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కూడా జూన్ 30న ఈ నిధులను విడుదల చేస్తుండటం విశేషం.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...