ఏపీకి రష్యన్ పెట్టుబడులు!

posted on: Jun 4, 2026 4:08PM

 

స్టీల్ ప్లాంట్, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటుకు నారా లోకేష్ ప్రతిపాదనలు...

రష్యా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నోవోస్టల్-ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడుల అవకాశాలపై చర్చించిన లోకేష్, రీబార్‌లు, వైర్ రాడ్‌ల తయారీకి అత్యాధునిక స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో పాటు లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను వివరించారు. ఈ ప్రతిపాదనలు ఆకర్షణీయంగా ఉన్నాయని, వాటిని పరిశీలిస్తామని డెమ్చెంకో సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

భారత్‌లో వేగవంతమైన పర్యావరణ అనుమతులు, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాల మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (EAF) ఆధారిత స్టీల్ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. ఈ ప్లాంట్ ద్వారా ఉన్నత శ్రేణి రీబార్‌లు, వైర్ రాడ్‌ల ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.

అలాగే శ్రీసిటీలో రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో కూడిన స్ట్రక్చరల్ సెక్షన్, రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలో ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు నేరుగా సరఫరా చేసే గాల్వనైజ్డ్ వైర్ తయారీ యూనిట్‌ను స్థాపించాలని సూచించారు.

నోవోస్టల్-ఎం సరఫరా వ్యవస్థతో అనుసంధానంగా ప్రత్యేక వాటర్‌ఫ్రంట్ బెర్త్‌లతో కూడిన ముడి పదార్థాల లాజిస్టిక్స్ హబ్‌ను అభివృద్ధి చేసేందుకు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని కూడా లోకేష్ ప్రతిపాదించారు. భారత్‌లోని సౌర, పవన విద్యుత్ కారిడార్లను వినియోగిస్తూ లో-కార్బన్ స్టీల్ ఉత్పత్తిలో భాగస్వామ్యం కావాలని కోరారు.

ఈ సందర్భంగా నోవోస్టల్-ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో మాట్లాడుతూ, తమ సంస్థ ఏటా 2.8 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తూ 60కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత మార్కెట్ విస్తరణలో భాగంగా నిర్మాణ, తయారీ రంగాలకు సెమీ-ఫినిష్డ్ మరియు లాంగ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

ప్రీమియం స్టీల్ బిల్లెట్లు, స్ట్రక్చరల్ రీబార్‌లు, హై-స్పీడ్ వైర్ రాడ్‌లు, ప్రత్యేక వెల్డింగ్ వైర్ల సరఫరాలో తమ సంస్థకు విశేష అనుభవం ఉందని పేర్కొన్నారు. జాతీయ రైల్వే, హైవే ప్రాజెక్టులకు అవసరమైన లాంగ్ స్టీల్, రోల్డ్ ఉత్పత్తులను అందిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు.

ముంబై, చెన్నై వంటి ప్రధాన పోర్టుల ద్వారా దిగుమతి క్లియరెన్స్‌లు, బల్క్ పంపిణీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పెట్టుబడి అవకాశాలను సమగ్రంగా పరిశీలిస్తామని డెమ్చెంకో హామీ ఇచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...