బ్యాటింగ్ కాదు విధ్వంసం!
posted on Nov 15, 2025 8:52AM
.webp)
వీడెవడండీ బాబూ! వంద మంది వీరేంద్ర సెహ్వాగ్ లు ఒకే సారి బ్యాటింగ్ చేస్తున్నట్లు.. యాభై మంది రిషబ్ పంత్ ల ఇన్నింగ్స్ ఇన్ స్పిరేషన్ గా తీస్కున్నట్టు.. ఒక పద్ధతి ప్రకారం.. ప్రతి రెండో బాల్ కి ఒక సిక్స్ కొడుతూ.. స్కోర్ బోర్డుకు రన్నింగ్ రేస్ నేర్పిస్తున్నట్టు ప్రతి బాల్ నీ ఫోర్ గానీ సిక్స్ గానీ వెళ్లేలా చేస్తూ.. ఆ మాటకొస్తే.. బాలు ఉన్నదే తాను ఫోర్లూ సిక్స్ లు కొట్టేందుకన్నట్టు.. కలలో రాకుమారుడుగానీ బ్యాటు పట్టుకుని ఫటా ఫటా బాదినట్టూ.. పుస్తకాల్లో మాత్రమే కనిపించే కామిక్ క్యారెక్టర్ గానీ మాయలూ మంత్రాలు చేసినట్టు..
ఇలా ఒకటా రెండా ఆ విశేషణాలు అన్నీ ఇన్నీ కావు.. యూఏఈ తో ఇండియా ఏ జట్టు ఆడిన ఈ ట్వంటీ ట్వంటీలో స్టేడియంలో కూర్చున్నదే పట్టుమని పాతిక మంది.. వారంతా కలసి వైభవ్ సూర్యవంశీ ఆడుతుంటే..స్టేడియం నిండా జనమున్నట్టు ఆ అరుపులేంటి కేకలేంటి..???
జస్ట్ 17 బంతుల్లో హాఫ్ సెంచురీ, జస్ట్ 32 బంతుల్లో సెంచురీ.. ప్రతి బంతినీ ఆకాశం చూడాలా అన్నట్టు చితకబాదుతూనే వెళ్లాడంటే నమ్మండీ..
అబ్బబ్బబ్బ 10 ఫోర్లు 15 సిక్సులూ.. ఇలా చెబుతూ పోతుంటే ఆ ఇన్నింగ్స్ లో వైభవ్ సూర్యవంశీ పారించిన పరుగుల వరదకు ఒక అంతే లేదా అన్నట్టు మారింది అతడి బ్యాటింగ్ సెన్సేషన్.
అసలు వీ అన్న అక్షరంతో పేరున్న వాళ్లంతా ఒక్కో వీరేంద్ర సెహ్వాగ్ లా చెలరేగుతారా? అన్నట్టుగా సాగిందా విధ్వంసకర ఇన్నింగ్స్. కేవలం 41 బంతుల్లో 144 పరుగులు చేసి.. ఎట్టకేలకు అతడు ఔట్ అయితే ప్రదత్యర్ధి ప్లేయర్లు కూడా హర్ట్ అయ్యారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.. అది కోత కాదు.. మామా ఊచ కోత!
అతడు ఆడిన మొదటి బంతికే ఇచ్చిన క్యాచ్ ని ఎందుకు డ్రాప్ చేశామా? అని ప్రత్యర్థి జట్టు ఫీలవలేదంటే ఒట్టు. ఒక సమయంలో ఆ క్యాచ్ పట్టి ఉంటే ఇంతటి విధ్వంసకర ఇన్నింగ్స్ ని మనం కూడా చూడలేక పోయే వాళ్లం కదాని యూఏఈ జట్టు ఆటగాళ్లు కూడా ఫీలయ్యేలా చేశాడు పట్టుమని పదిహేను ఏళ్లు కూడా లేని వైభవ్ సూర్యవంశీ.