రేవంత్‌రెడ్డిని వాడుకుని వదిలేశారు!
posted on Apr 9, 2014 5:02PM
.jpg)
తెలుగుదేశం పార్టీలో సత్తావున్న నాయకులలో ఒకరైన రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న పరిస్థితులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అండగా నిలిచిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కూరలో ఏరిపారేసే కరివేపాకులా వాడుకుని వదిలేసిన వ్యక్తిలా అవమానాలు ఎదుర్కోవడం బాధాకరమని అంటున్నారు. ఈ అంశం పూర్వాపరాల్లోకి వెళ్తే...
ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా వున్న రేవంత్‌రెడ్డి గత రెండు సంవత్సరాలుగా తనకు వచ్చే ఎన్నికలలో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి వుందని చెబుతూ వస్తున్నారు. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. మంచి వాగ్ధాటి, అన్ని అంశాల మీద సంపూర్ణమైన అవగాహన, విషయ పరిజ్ఞానం వున్న రేవంత్‌రెడ్డిని చంద్రబాబు రాజకీయంగా బాగా ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకున్నారని అనడం కంటే, అడ్డదిడ్డంగా వాడుకున్నారనడం బెటర్. అటు జగన్ మీదకి అయినా, కిరణ్ కుమార్‌రెడ్డి మీదకి అయినా, ఇటు కేసీఆర్ దగ్గర్నుంచి ఏ తెలంగాణ నాయకుడి మీదకి అయినా రేవంత్‌రెడ్డి అనే అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించేవారు. రేవంత్‌రెడ్డి అనేక సందర్భాలలో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసి తెలుగుదేశానికి రాజకీయంగా మైలేజీ పెంచారు. అలా తెలుగుదేశం పార్టీకి అస్త్రంలా ఉపయోగపడిన రేవంత్‌రెడ్డి వస్త్రాలు ఒలిచే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది.
ఈ ఎన్నికలలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తిని రేవంత్‌రెడ్డి చంద్రబాబు దగ్గర వ్యక్తం చేసినప్పుడు అటు వైపు నుంచి నో రెస్పాన్స్. ఆ తర్వాత రేవంత్‌రెడ్డికి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా కట్టయింది. మల్కాజ్‌గిరి పార్లమెంటు టిక్కెట్ రేవంత్‌రెడ్డిని కాదని ఆర్థికంగా బలంగా వున్న ఒక వ్యాపారవేత్తకు ఇచ్చే ప్రయత్నం జరిగినప్పుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మల్కాజిగిరి టిక్కెట్ని సదరు వ్యాపారికి కేటాయించడానికి నలభై కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు కూడా వున్నాయి.
తనకు టికెట్ కేటాయించాలని మరోసారి కోరేందుకు రేవంత్‌రెడ్డి మూడు రోజులుగా చంద్రబాబుని కలవటానికి ప్రయత్నిస్తున్నా బాబు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగిన తనకు ఇప్పుడు అపాయింట్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి వచ్చేసరికి రేవంత్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. టిక్కెట్ ఇవ్వకపోయినా తాను మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచే నామినేషన్ వేస్తానని రేవంత్‌రెడ్డి బెదిరించేసరికి చంద్రబాబు దూతలుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ రంగంలోకి దిగి రేవంత్‌రెడ్డిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
రేవంత్‌రెడ్డి నామినేషన్ నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేశారు. దీనికితోడు బుధవారం నాడు కోడంగల్ అసెంబ్లీ స్థానానికి రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో నామినేషన్లకు బుధవారమే చివరి రోజు కావడంతో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళాలా.. లేక పార్టీ చెప్పిన సీటులో నామినేషన్ వేయలా అన్న సందిగ్ధంలో రేవంత్‌రెడ్డి వున్నారు. ఇంతకాలం పార్టీకి సేవ చేసినా తనను చంద్రబాబు ఎంతమాత్రం పట్టించుకోకపోవడం, కనీసం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి అయినా మాట్లాడకుండా మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడపటం పట్ల రేవంత్‌రెడ్డి ఎంతో బాధపడుతున్నట్టు సమాచారం. కనీసం తాను చంద్రబాబు స్వయంగా మాట్లాడ్డానికి కూడా పనికిరాకుండా పోయానా అని తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.