సమ్మెలను తట్టుకునే శక్తి కావాలి
posted on May 10, 2015 8:23AM

కార్మికుల హక్కుల గురించి నినదించడానికి, సమస్యల గురించి నిరసన వ్యక్తం చేయడానికి ప్రారంభమైన ‘సమ్మె’ అనే ఆయుధం ఇప్పుడు మారణాయుధంగా మారింది. స్వార్థమే పరమావధిగా, ప్రభుత్వాలకు వున్న సమస్యల గురించి మాకెలాంటి సంబంధం లేదన్నట్టుగా, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడితే మాకేంటి అన్నట్టుగా ‘సమ్మె’ ఎదిగింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెని మాత్రమే దృష్టి పెట్టుకుని చెబుతున్న మాటలు కావు ఇవి. అనేక ప్రభుత్వ సంస్థలు కావచ్చు... ప్రైవేటు కంపెనీలు కావచ్చు... ఎక్కడైనా సమ్మె అనేది వికృతరూపం దాల్చింది. అమలుకు సాధ్యం కాని కోరికలు కోరడం... వాటికి యాజమాన్యాలు అంగీకరించకపోతే సమ్మెకు దిగిపోవడం. తమ సమ్మె విజయవంతం అయింది అనిపించుకోవడం కోసం ధర్నాలు, ప్రదర్శనలు జరపడం, పోలీసులు లాఠీ ఛార్చ్ చేసే వరకూ పరిస్థితిని తీసుకురావడం. ఎవరైనా గాయపడితే పెద్ద ఇష్యూ చేయడం. వీరు సమ్మె చేస్తున్నారు కదా అని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే భౌతిక దాడులకు దిగడం... ఇదీ ఇప్పుడు సమ్మె అనే వ్యవస్థ చేరుకున్న స్థితి. సమ్మె కారణంగా కోట్లాదిమంది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎంతమాత్రం పట్టించుకోకుండా వుండే కఠినత్వానికి సమ్మెలు చేస్తు్న్నవారు చేరుతున్నారు.
సరే, నేటి మన వ్యవస్థలో ఎవరూ ఎవరినీ అదుపు చేసే స్థితిలో లేరు. ఎవరు ఎవరికి నీతులు చెప్పినా వినే పరిస్థితి అంతకన్నా లేదు. సమ్మెల విషయంలో కూడా ఇదే సూత్రం. మా సమ్మె మా ఇష్టం... మధ్యలో అడగటానికి నువ్వెవరివని సామన్య ప్రజలను ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. అందుకే ఇప్పుడు అలాంటి సామాన్యులందరి తరఫున ఆ భగవంతుడు అనేవాడు ఒకడు వుంటే ఆయన్ని కోరుకునేది ఒక్కటే... స్వామి... ఎవరి సమ్మెలను వారిని చేసుకోనివ్వు.. కానీ ఆ సమ్మెలను తట్టుకునే శక్తిని మాకు ఇవ్వు. ఏ వ్యవస్థ సమ్మెలోకి దిగినా ఆ వ్యవస్థ లేకుండానే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుని జీవన మార్గంలో ప్రయాణించే అవకాశమివ్వు. ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీ సమ్మెని ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగించేలా చేయి. ఎంత సుదీర్ఘ కాలం అంటే... ఆర్టీసీ బస్సులు ఎక్కకపోయినా జనజీవనం మామూలుగానే గడిచిపోయేంత అలవాటైపోయే వరకూ. ప్రజలకు ఆర్టీసీ అనే వ్యవస్థతో అవసరం లేని మానసిక స్థితి వచ్చినప్పుడు, సమ్మె జరిగితే ఏంటంట... బస్సులు తిరిగితే ఏంటంట అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమ్మెలు జనజీవనాన్ని ఎంతమాత్రం ప్రభావితం చేయలేవు. అయితే ఇది అత్యాశ అని తెలుసు... కానీ దురాశ మాత్రం కాదు... ఎవరు లేకపోయినా ప్రకృతి తన పని తాను చేసుకుని పోతున్నట్టుగా ఏ వ్యవస్థ లేకపోయినా ప్రజల జీవనంలో ఎలాంటి ఒడిదుడుకులు రాని రోజు రావాలి.