ఆర్టీసీ చర్చలు విఫలం అవడానికి ఎవరు కారణం?
posted on May 9, 2015 9:57AM
.jpg)
ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాకపోవడంతో రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ సంస్థకు సాంభశివరావు మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన నిన్న ఆంధ్రా, తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించి, “ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే 27 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వగలమని కానీ తెలంగాణా ఉద్యోగులకు ఎంత ఇచ్చేది ఇప్పుడే చెప్పలేమని ఎందుకంటే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ విషయంలో స్పందించిందని తెలంగాణా ప్రభుత్వం ఇంకా ఈ విషయంపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని” చెప్పడంతో అటువంటప్పుడు తమను ఎందుకు చర్చలకు పిలిచారంటూ తెలంగాణాకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు అశ్వత్థామ, కె. పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు, కొమిరెల్లి రాజిరెడ్డి తదితరులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అది వారి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో ఆయన ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్చల మధ్యలోనే బయటకి వెళ్ళిపోయారు. ఆయన చాల నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ఆంధ్రాకు చెందిన ఆయనతో తాము ఇకపై చర్చలకు కూర్చోబోమని తెలంగాణాకు చెప్పడంతో ఆయన కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందించారు.
ఆయన తక్షణమే ఆర్టీసీ బస్ భవన్ లో ఆంధ్రాకు కేటాయించిన ‘ఏ’ బ్లాకులోకి తన చాంబర్ ని మార్పించుకొన్నారు. అంతే కాదు ఇకపై తెలంగాణాకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు జేఎండీ రమణారావుతోనే చర్చించుకోవాలని, తను ఇకపై తెలంగాణా ఆర్టీసీ వ్యవహారాలలో కలుగజేసుకోనని ప్రకటించారు. ఈనెల 14 నుండి ఆంధ్రా, తెలంగాణా ఆర్టీసీలు బస్ భవన్ లో ‘ఏ’ ‘బి’ బ్లాకుల నుండి వేర్వేరుగా నిర్వహించుకొనేందుకు నిర్ణయించుకొన్నాయి. కానీ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున ఆంధ్ర, తెలంగాణా ఆర్టీసీ సంస్థలు రెండింటికీ ఆయనే మేనేజింగ్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు.
నిన్న జరిగిన పరిణామాలతో కలత చెందిన ఆయన స్వచ్చందంగా తెలంగాణా బాధ్యతల నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యకర పరిణామమేనని చెప్పక తప్పదు. ఉద్యోగులు వేతనాల పెంపు గురించి మొదలయిన చర్చలు ఈవిధంగా ప్రాంతీయ బేధాలకు దారి తీయడం ఆశ్చర్యమే కానీ అది అనివార్యమవుతుందని ఊహించడం పెద్ద కష్టం కాదు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల పెంపుగురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకొంటునప్పుడు ఉద్యోగ సంఘాల నేతలతో వేర్వేరుగా చర్చలు జరుపకుండా అందరితో ఒక్కసారే మాట్లడాలనుకోవడం ఆర్టీసీ యాజమాన్యం చేసిన తప్పయితే, వేతన సవరణ గురించి చర్చించడానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు ఆ విషయం గురించి మాట్లాడకుండా వేరే విషయాల గురించి మాట్లాడటం కూడా అంతే తప్పు. ఈ సమస్య మరిన్ని చిక్కు ముడులు పడకూదనుకొంటే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల ఆర్టీసీ విభజన ఎలాగూ జరుగుతోంది కనుక సంబంధిత అధికారులు, మంత్రులే తమ తమ రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కొనసాగిస్తే మంచిది.