ఆర్టీసీ ఉద్యోగులకు రాక్షసత్వం తగదు
posted on May 7, 2015 12:32AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. విధులకు హాజరు కావడం లేదు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థులయితే ఎంతో టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్ తమకూ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు పట్టుపడుతున్నారు. 27 శాతం వరకు ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించినప్పటికీ మెట్టు దిగని ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు చీటికి మాటికి సమ్మెకు దిగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు జరుపుతున్న సమ్మెలో భాగంగా కొంతమంది ఆర్టీసీ సిబ్బంది అదుపు తప్పి వ్యవహరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ యాజమాన్యం ఒప్పంద ఉద్యోగులతో బస్సులను నడిపే ప్రయత్నాలు చేస్తోంది. అయితే అలాంటి బస్సులను ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. ప్రజల సమస్యలు తమకు ఎంతమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అక్కడితే ఆగితే పర్లేదని అనుకోవచ్చు. బస్సులను నడపడానికి వచ్చిన ఒప్పంద ఉద్యోగుల మీద రాక్షసంగా దాడులు చేస్తున్నారు. నంద్యాలలో ఒక ఒప్పంద ఉద్యోగిని చావగొట్టారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఒప్పంద ఉద్యోగి నడుపుతున్న బస్సు మీద ఆర్టీసీ ఉద్యోగులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు ధ్వంసం కావడం మాత్రమే కాకుండా, బస్సు నడుపుతున్న ఒప్పంద ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ ఉద్యోగులు ఇలాంటి రాక్షసత్వాన్ని విడిచిపెట్టాలి.