నోట్ల రద్దుతో పాట్లు చిన్నవారికేనా

posted on: Nov 11, 2016 1:38PM

 

తరాల తరబడి నమ్ముకున్న పొలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుని భద్రంగా దాచుకున్నది ఒకరు. పిల్ల పెళ్లి కోసం ఐదు రూపాయల వడ్డీకి లక్షలు తెచ్చుకున్నది మరొకరు. ఎలాగొలా విదేశాలకు ఎగిరిపోవాలన్న ఆశతో సొమ్ము కూడపెట్టినవారు ఇంకొకరు. ఇప్పడు వీళ్లందరిదీ కక్కలేకా మింగలేకా దిక్కుతోచని పరిస్థితి. పోనీ వారందరి సంగతీ వదిలేద్దాం! ఈ రెండు రోజులూ మిగతా ప్రజలు పడ్డ కష్టం మాటేమిటి. ఏటీఎంల దగ్గరా, బ్యాంకుల వద్దా క్యూలు పల్చబడాలంటే మరో వారం రోజులు పడుతుంది. అప్పటివరకూ సామాన్యుల పరిస్థితి ఏంటి!

 

పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదే! ఆ విషయంలో ఇప్పటికే దేశప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఈ నిర్ణయంతో మోదీ చేతల మంత్రిగా ఒక స్థానం సంపాదించేసుకున్నారు. బడాబాబుల దగ్గర బస్తాలుగా మూలుగుతున్న పెద్ద నోట్లన్నీ ఈ దెబ్బతో చిత్తు కాగితాలుగా మారిపోతాయి. ఆర్థిక ఉగ్రవాదంతో చెలరేగుతున్న పాకిస్థాన్‌కు ఇది శరాఘాతంగా మిగులుతుంది. కానీ నోట్లని రద్దు చేసే ముందు దానికి తగిన సన్నధత ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచించలేదేమో అన్నది ప్రస్తుత ఆరోపణ.

 

పెట్రోలు బంకుల వద్ద కానీ, రైల్వే స్టేషన్లలో కానీ మోదీ చెప్పిన నోటు చెల్లుబాట్లు జరగనేలేదు. ఇక పాలబూత్‌లూ, గ్యాస్ సిలండర్ల ఏజన్సీల సంగతి సరేసరి! బడాబాబులు నల్ల ధనాన్నంతా విచ్చలవిడిగా బంగారం కిందకి మార్చుకుంటున్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు నోట్ల మార్పిడి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఒకవేళ ఎలాగొలా కష్టపడి నోట్లను మార్చుకున్నా ఎక్కువగా రెండువేల రూపాయల నోట్లే చేతికి రావడంతో, వాటితో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేని పరిస్థితి.

 

చిన్నవారి పరిస్థితి ఇలా ఉంటే పెద్దవారి పరిస్థితి మరోలా ఉంది. బంగారం కిందకో, బినామీల చేతికో, రుణాలుగానో నల్లధనాన్ని శుభ్రంగా మార్చేసుకుంటున్నారు. పైగా మోదీ ప్రకటన ముందే కొందరు బడాబాబులకి ఈ విషయం తెలిసిపోయిందనీ, వారంతా గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్తపడిపోయారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తగినంత సన్నద్ధత లేకుండానే పెద్దనోట్లని రద్దుచేశారన్న మాట మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. యూపీ ఎన్నికలలో ప్రతిపక్షాలని దెబ్బతీసేందుకు భాజపా ఈ నిర్ణయానికి తొందరపడిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయాలేమీ ఎరుగని నోటు మీద గాంధీతాత చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...