సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సౌదీ అరేబియాలో సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన  45 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.   కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎమ్ఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందాన్ని తక్షణమే సౌదీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. మృత దేహాలను అక్కడే ఖననం చేయాలని, ఇందుకోసం బాధిత కుటుంబాల్లో ఇద్దరిని చొప్పున సౌదీ తీసుకు వెళ్ళాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొంది. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని పేర్కొంది. 
కాగా సౌదీ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించిన దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన మృతుల కుటుంబాలను తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

  ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తాయని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.
అలాగే సౌదీ ప్రమాదంలో 45 మంది తెలంగాణ వాసులు మరణించడం పట్ల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదం తన హృదయాన్ని కలచివేసిందని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

కాగా  ఈ ప్రమాద ఘటనపై  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన చంద్రబాబు పవిత్ర ఉమ్రా యాత్రలో తెలంగాణకు చెందిన మన సోదర సోదరీమణులు మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సౌదీ బస్సు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కూడా సౌదీ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu