ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణలో తడబడిన సునీల్ నాయక్

posted on: Apr 6, 2026 1:14PM

రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో  బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విచారణాధికారి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సునీల్ నాయక్ ను విజయనగరం మహిళా పోలీసు స్టేషన్ కార్యాలయంలో ఆదివారం (ఏప్రిల్ 5)  విచారించారు. విచారణ అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్‌ స్వయంగా విచారించారు. అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఎవరి ఆదేశాలతో అరెస్టు చేశారు?  టార్చర్‌ పెట్టాలన్న ఆదేశాలు ఎక్కడ నుంచి వచ్చాయి? రఘురామకృష్ణం రాజుపై  రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు?  రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా?  ఉంటే ఎవరిచ్చారు?  సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?  అంటూ దామోదర్ సునీల్ నాయక్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.

ఇలా ఉండగా విచారణకు సునీల్ నాయక్ ఏ మాత్రం సహకరించలేదని అంటున్నారు.   హైదరాబాద్‌ వెళ్లి మరీ రఘురామకృష్ణం రాజును ఎలా అరెస్టు చేశారు. అలా హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేయడం   చట్టపరిధి దాటడమే కదా? ఏ ప్రతిఫలం ఆశించి రూల్స్‌కు వ్యతిరేకంగా కేసులు పెట్టారు? అంటూ విచారణాధికారి సునీల్‌నాయక్‌ ను ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే వీటిలో చాలా ప్రశ్నలకు సునీల్ నాయక్ సమాధానం చెప్పలేక తడబడినట్లు తెలిసింది.  అ  గుండె ఆపరేషన్‌ అయి కోలుకుంటున్న రఘురామకృష్ణం రాజును  హైదరాబాద్ నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరం కారులో ఎలా తీసుకొస్తారు? అలా  కారులో తీసుకురమ్మని మీకు ఎవరైనా ఆదేశాలిచ్చారా?  అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.  

ఇదే కేసులో  సీఐడీ ఏఎస్పీగా ఉంటూ రిటైర్డ్‌ అయిన విజయపాల్‌ ను   శనివారం(ఏప్రిల్ 4)  విచారించిన సంగతి తెలిసిందే. ఆ  సందర్భంగా  డీఐజీ హోదాలో ఉన్న సునీల్‌నాయక్‌ ఆదేశాలతోనే రఘురామను అరెస్టు చేశానని విజయపాల్‌ చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సునీల్‌ నాయక్‌ను ఎస్పీ దామోదర్‌ అడిగినట్టు తెలుస్తోంది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...