సికింద్రాబాద్‌లో 800 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం
posted on: Mar 17, 2026 4:54PM

సికింద్రాబాద్ పార్సిగుట్టలో “ఫ్రెష్” అనే పేరుకు అసలు అర్థం ఏమిటో కొత్తగా నిర్వచనం చెప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. బయట బోర్డు మీద “ఏ వన్ ఫ్రెష్ చికెన్” అని మెరిసిపో తుంటే, లోపల మాత్రం కుళ్లిపోయిన చికెన్ నిల్వల తో దుర్వాసన రాజ్యం నడుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం అధికా రులు కలిసి దాడి చేయ డంతో అసలు కథ బట్టబయలైంది. ఏ వన్ ఫ్రెష్ చికెన్ షాప్లో తాజాగా అమ్మాల్సిన చికెన్… “కాలం చెల్లిన క్లాసిక్”గా ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న దృశ్యాలు చూసి అధికా రులు అవాక్కయ్యారు.
“ఫ్రెష్” అంటే రోజూ కట్ చేసిన చికెన్ అనుకుంటే పొరపాటే! ఇక్కడ ఫ్రెష్ అంటే “ఎప్పట్నుంచో ఫ్రిజ్‌లో ఫ్రీగా ఉన్నది” అన్నమాట...నడుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం అధికారులు కలిసి దాడి చేసి.. సుమారు 800 కిలోల కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అది కేవలం షాపుకే కాకుండా వైన్స్, బార్‌లు, రెస్టారెంట్లకు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. “కిక్కు ఎక్కితే ఏం తింటున్నారో ఎవరికీ తెలియదు” అన్న ధీమాతో సరఫరా కొనసాగిందన్న మాట. ఇక లైసెన్స్ విషయానికి వస్తే… అది కూడా “చరిత్ర”లో భాగమే. గత జనవరిలోనే ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినా, వ్యాపారం మాత్రం పూర్తి ఊపులో సాగింది. అనుమతులకు విరుద్ధంగా గోడౌన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
దాడి సందర్భంగా షాపు నిర్వాహకుడు షకీల్‌తో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ “ఫ్రెష్ కథ”లో ఇంకా ఎన్ని లింకులు బయటపడతాయో తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఆరోగ్య శాఖ అధికారి అగ్నివేష్ మాట్లాడుతూ, ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించగా భారీగా నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చికెన్ బయటపడిందని తెలిపారు. నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించామని, నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తానికి… “ఫ్రెష్” అనే బోర్డు చూసి నమ్మే రోజులే పోయాయి






