రోహిత్ శర్మ, రికెల్టన్ పరుగుల వరద.. ఎల్ఎస్ జీపై ముంబై ఇండియన్స్ ఘన విజయం

posted on: May 5, 2026 9:24AM

ముంబైలోని వాంఖెడే మైదానంలో ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం (ఏప్రిల్ 4) జరిగిన జరిగిన  పోరులో ముంబై ఇండియన్స్ సునాయాస విజయం సాధించింది.  టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన  లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఆటగాళ్లు ఆడుతూపాడుతూ ఛేదించేశారు. ముఖ్యంగా  ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే ముంబై 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

 టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా మిచెల్ మార్ష్ (44), హిమ్మత్ సింగ్ (40 నాటౌట్) రాణించడంతో లక్నో భారీ స్కోరును నమోదు చేయగలిగింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 229 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు.  తొలి వికెట్‌కు వీరిద్దరూ కేవలం 10.5 ఓవర్లలోనే 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పారు. రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రికెల్టన్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు బాదడం విశేషం.

ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత తిలక్ వర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (12) స్వల్ప వ్యవధిలోనే అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే.. నమన్ ధీర్  23 నాటౌట్ , విల్ జాక్స్  10 నాటౌట్  బాధ్యతాయుతంగా ఆడి ముంబైకి విజయాన్నందించారు.  

ఈ విజయం ముంబై ఇండియన్స్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం, రికెల్టన్ విధ్వంసకర బ్యాటింగ్ లీగ్‌లో ఇతర జట్లకు హెచ్చరికగా మారింది. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని ముంబై అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు, భారీ స్కోరును కాపాడుకోవడంలో విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ తమ బౌలింగ్ విభాగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...