డాక్టర్ ముసుగులో దోపిడీలు…ఇద్దరు అరెస్ట్

posted on: Mar 17, 2026 6:47PM

 

విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఓ లేడీ కిలాడి డాక్టర్ అవతారం ఎత్తి.... పేషెంట్లను చూస్తున్నట్లుగా నటిస్తూ వారి వద్ద నుండి నగలు దోచుకొని అక్కడి నుండి చటక్కున మాయమవుతుంది... మళ్లీ మరోచోట ఇదే తరహాలో దొంగతనానికి పాల్పడుతుంది.  ఈ దొంగతనాలు చేయడంలో లేడీ కిలాడి ఒక్కతే కాదండోయ్ ఈమెతో పాటు ఈమె జీవిత భాగస్వామి భర్త కూడా ఆమెకు తోడై ఉన్నాడు... ఇద్దరు కలిసి కొత్త తరహాలో డాక్టర్ అవతారం ఎత్తి దొంగతనాలు చేస్తూ... బంగారం అమ్మగా వచ్చిన డబ్బుతో జలసాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పాపం వీరి బండారం ఎప్పటికీ బయటపడదని అనుకున్నారు కానీ పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో ఈ ఇద్దరు కిలాడీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది..

సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. వైద్యురాలిగా నటిస్తూ ఆసుపత్రుల్లో రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరిస్తున్న యువతిని, ఆమెకు సహకరిస్తున్న భర్తతో కలిసి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష (25) ప్రస్తుతం ఫార్మ్-డి చదువుతోంది. 

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో భర్త ఎడులపల్లి సాయి కుమార్ గౌడ్ (30)తో కలిసి ఈ రకం మోసాలకు పాల్పడుతుంది. శిరీష తన వైద్య పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త తరహా మోసానికి తెరలేపింది డాక్టర్ కోటు (అప్రాన్) ధరించి వివిధ ఆసుపత్రుల్లోకి ప్రవేశించి, వైద్యురాలిగా నటిస్తూ రోగుల నమ్మకం పొందేది. ముఖ్యంగా వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని,చికిత్స పేరుతో ‘డయాజెపామ్’ అనే మత్తు ఇంజక్షన్ ఇచ్చేది. 

ఆ ఇంజక్షన్ ప్రభావంతో వారు స్పృహ కోల్పోయేవారు. తర్వాత వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించి అక్కడి నుంచి పరారయ్యేది.ఈ దంపతులు ఇటీవల సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి, చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ, షాపింగ్‌లు, వినోదాలకు ఖర్చు చేస్తుండేవారు.

సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, మార్కెట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, ఒక మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, అలాగే చందానగర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు... మొత్తం రెండు కేసులు నమోదు అయ్యాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...